ఓటుతో బుద్ది చెప్పండి : అమిత్ షా

Update: 2019-05-15 15:13 GMT

ఓటుతో తృణమూల్ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని  బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు. తన ర్యాలీలో ఘర్షణలు చెలరేగేలా చేసింది తృణమూల్ అని ఆరోపించారు. 'బెంగాల్‌ ప్రజలకు నా వినతి.. మీరు హింసాత్మక ఘటనలకు సంబంధించి తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఓటు ద్వారా బుద్ధి చెప్పండి. ఆఖరి దశలో జరిగే ఎన్నికల్లో భాజపాకు ఓటు వేయండి. పశ్చిమ బంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ను అంతమొందించాల్సిన అవసరం ఉంది'' అని ఆయన చెప్పారు.

కోల్‌కతాలో నిర్వహించిన బీజేపీ ర్యాలీకి విపరీతమైన స్పందన లభించింది. నగరంలో చాలా మంది ఈ మెగా ర్యాలీకి హాజరయ్యారు. దీన్ని ఓర్చుకోలేని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ ర్యాలీని భగ్నం చేయాలని చూసింది. ఆవేశంతో వారు ర్యాలీలో దాడులు జరిపారు. అయినా మా ర్యాలీ అనుకున్న సమయానికి, అనుకున్న చోట పూర్తయింది. ఇందుకు బీజేపీకార్యకర్తలందరికీ ధన్యవాదాలు అని ఆయన అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మంగళవారం అమిత్‌ షా నిర్వహించిన మెగా ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. భాజపాకు అనుకూలంగా నినాదాలు చేస్తూ జనం హోరెత్తిస్తున్న సమయంలో అమిత్‌ షా కాన్వాయ్‌పైకి గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లు విసిరేశారు. దీంతో భాజపా కార్యకర్తలు ఆగ్రహించారు. రోడ్డు పక్కన ఉన్న వాహనాలకు కొందరు నిప్పు పెట్టారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

కాగా, ఈ సంఘటనల నేపథ్యంలో ఇంకా ఒకరోజు సమయం ఉండగానే ఎన్నికల కమిషన్ పశ్చిమ బెంగాల్ లో ప్రచారాన్ని నిలిపివేయాలని అన్ని రాజకీయ పార్టీలనూ ఆదేశించింది. 

Similar News