సీబీఐ చీఫ్ అలోక్ వర్మకు షాక్

తీవ్ర సంచలనం సృష్టించిన సీబీఐ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. 77 రోజుల సుదీర్ఘ సమయం తర్వాత సీబీఐ చీఫ్‌గా నిన్ననే బాధ్యతలు తీసుకున్న అలోక్‌ వర్మను సెలక్ట్‌ కమిటీ ఆ బాధ్యతల నుంచి తప్పించింది.

Update: 2019-01-10 14:25 GMT

తీవ్ర సంచలనం సృష్టించిన సీబీఐ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. 77 రోజుల సుదీర్ఘ సమయం తర్వాత సీబీఐ చీఫ్‌గా నిన్ననే బాధ్యతలు తీసుకున్న అలోక్‌ వర్మను సెలక్ట్‌ కమిటీ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. సుప్రీం తీర్పు తర్వాత అలోక్‌ వర్మ నిన్ననే బాధ్యతలు స్వీకరించారు. అంతేకాకుండా ఆయన విధుల్లోకి చేరాక 12 మంది అధికారులను కూడా బదిలీ చేశారు. తాను పదవిలో లేనప్పుడు తాత్కాలిక డైరెక్టర్‌ ఎం నాగేశ్వర్‌రావు చేపట్టిన బదిలీలను ఆయన రద్దు చేశారు.

24 గంటల్లో రెండుసార్లు సమావేశం అయిన సెలక్ట్‌ కమిటీ అలోక్‌ వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయనపై వచ్చిన ఆరోపణలపైన ప్రధాని మోడీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు ఖర్గే, జస్టిస్‌ సిక్రీ సభ్యులుగా ఉన్న కమిటీ అలోక్‌ వర్మను ఆ పదవి నుంచి తప్పించింది. దీంతో సీబీఐ చీఫ్ విషయంలో ఇలాంటి నిర్ణయం వెలువడటం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. సీబీఐ డైరెక్టర్‌ను తొలగించే అధికారం కేంద్రానికి లేదని సెలక్ట్‌ కమిటీకే ఆ బాధ్యత అని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ మర్నాడే ఆయన బాధ్యతలను స్వీకరించారు. తర్వాతి రోజు అలోక్‌ వర్మను తొలగిస్తూ సెలక్ట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. గతేడాది సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్థానా మధ్య అవినీతి ఆరోపణలతో మొదలైన వివాదం చివరకు ఇద్దరినీ విధుల నుంచి సెలవులపై పంపించే వరకు వచ్చింది.  

Similar News