కన్న కొడుకు శవంతో వర్షంలో రాత్రంతా నడిరోడ్డుపై ..!

Update: 2017-09-15 15:58 GMT

హైదరాబాద్: కన్నతల్లి నడిరోడ్డుపై కొడుకు శవంతో వర్షంలో తడుస్తూ గడిపిన దయనీయ దుస్థితిని హైదరాబాద్ మహానగరం మౌనంగా తిలకించింది. సెప్టెంబర్ 14న ఈ ఘటన జరిగింది. నగరంలో గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఓ తల్లికి పెద్ద కష్టమొచ్చింది. కూకట్‌పల్లిలోని వెంకటేశ్వర నగర్ ప్రాంతానికి చెందిన ఈశ్వరమ్మ కొడుకు కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. 10 సంవత్సరాల ఆ బాలుడు నీలోఫర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 14 సాయంత్రం మృతి చెందాడు. ఆమె కొడుకు శవాన్ని అద్దెకుంటున్న ఇంటికి తీసుకెళ్లింది. ఆ ఇంటి యజమాని శవంతో ఇంట్లోకి అడుగు పెట్టొద్దని అమానుషంగా మాట్లాడాడు. తన ఇంట్లో శుభకార్యం జరిగి సంవత్సరం కూడా కాలేదని.. శవాన్ని ఇంట్లోకి తీసుకొస్తే తమ కుటుంబానికి అశుభమంటూ నిష్టూరంగా చెప్పాడు. ఆమె తనకు సొంత ఇల్లు లేదని, దహన సంస్కారాల వరకైనా దయతలచమని ఎంతగానో బతిమిలాడింది. అయినా కర్కశత్వంతో నిండిన ఆ ఇంటి యజమాని మనసు కరగలేదు. దీంతో ఆ తల్లి చేసేదేమీ లేక, వేరే దిక్కు లేక ఇంటి ముందు నడిరోడ్డుపై చిన్న కొడుకు శవంతో రాత్రంతా వర్షంలో గడిపింది. ఆమె పెద్ద కొడుకు కూడా ఆమెతో పాటు ఉన్నాడు.

ఉదయాన్నే ఆమె పరిస్థితి తెలిసి స్థానికులు చలించిపోయారు. ఏం జరిగిందని ఆరా తీయగా.. తన కూతురి పెళ్లి ఈ మధ్యే జరిగిందని.. అందుకే శవాన్ని ఇంటికి తేవొద్దని యజమాని చెప్పినట్లు ఆ మహిళ స్థానికులతో వాపోయింది. దీంతో వారు ఆమె కొడుకు శవంపై తడవకుండా పట్ట కప్పి.. 60వేల వరకూ చందాలు వేసుకుని ఆ బాలుడి అంత్యక్రియలు నిర్వహించారు. ఈశ్వరమ్మ తన ఇద్దరు కొడుకులతో కలిసి నాలుగేళ్లుగా గుప్తా అనే యజమాని ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమె మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఆ ప్రాంత బాలల హక్కుల సంఘ కార్యకర్త అచ్యుతరావు స్పందిస్తూ ఇది చాలా అమానుష ఘటన అని, ఆ యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.