అండర్ -19 ప్రపంచకప్ విజేత భారత్

Update: 2018-02-03 08:08 GMT

ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ టోర్నీలో మూడుసార్లు చాంపియన్ భారత్ చరిత్ర సృష్టించింది. నాలుగోసారి విశ్వవిజేతగా నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. న్యూజిలాండ్ లోని బే ఓవల్ క్రికెట్ గ్రౌండ్స్ లో ముగిసిన ఫైనల్లో...మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఆస్ట్రేలియా...47.2 ఓవర్లలో 216 పరుగులు మాత్రమ చేయగలిగింది. రెండోడౌన్ ఆటగాడు మెర్లో 76 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో పేసర్లు పోరెల్, నగర్ కోటీ, స్పిన్నర్లు శివ్ సింగ్, రాయ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 217 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు పృథ్వీ షా-మన్ జోత్ మొదటి వికెట్ కు 71 పరుగుల భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. గతంలో 2000, 2008, 2012 సంవత్సరాలలో చాంపియన్ గా, 2006, 2016 టోర్నీల్లో రన్నరప్ గా నిలిచిన భారత్...తిరిగి ఆరేళ్ల విరామం తర్వాత పృథ్వీ షా నాయకత్వంలో ప్రపంచకప్ సొంతం చేసుకోగలిగింది. గ్రూప్ -బీ లీగ్ ప్రారంభమ్యాచ్ లో కంగారూలను 100 పరుగులతో చిత్తు చేయడం ద్వారా టైటిల్ వేట మొదలుపెట్టిన భారత కుర్రాళ్ళు...టైటిల్ సమరంలో సైతం అదేజట్టును చిత్తు చేయడం విశేషం. భారత వన్ డౌన్ ఆటగాడు శుభ్ మాన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది ప్రపంచకప్ అవార్డు దక్కింది.
 

Similar News