ఈసీ నిర్ణయంపై టీ కాంగ్రెస్ ఆగ్రహం

Update: 2018-09-10 05:01 GMT

తెలంగాణ శాసన సభ రద్దు తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అక్టోబరు రెండో వారం తర్వాత ఎప్పుడైనా తెలంగాణలో ఎన్నికలు జరిపేందుకు ఈసీ సన్నాహాలు వేగవంతం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 2018 ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కుదించడంపై కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ఱయించింది.

తెలంగాణ శాసనసభ రద్దయిన నేపథ్యంలో త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. జనవరి ఒకటి 2019 నాటికి 18 ఏళ్లు నిండిన వారికోసం ప్రస్తుతం తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుండగా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఉన్నట్టుండి షెడ్యూల్ సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తతం జరుగుతున్న సవరణ ప్రక్రియను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నిర్ణయం తీసుకుంది. 2018 నాటి ఓటర్ల జాబితాకే సవరణ ప్రక్రియ చేపట్టాలని ఈసీ ఆదేశించింది. 2018 ఓటర్ల జాబితా సవరణ కోసం ఈనెల 10న ముసాయిదా విడుదల చేస్తారు. ఓటర్ల జాబితా ముసాయిదాపై అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్‌ 8న తుది జాబితా ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. తుదిజాబితాకు అనుగుణంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. 

అయితే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రద్దు చేయడం అక్రమమని కాంగ్రెస్ పార్టీ అంటోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఓటర్ల సవరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని దాన్ని విస్మరించే అధికారం ఈసీకి లేదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. ఓటర్ సవరణ ప్రక్రియను లెక్క చేయకుండా ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. 

ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఎన్నికల సంఘాన్ని మేనేజ్‌ చేసి ముందస్తు ఎన్నికలు జరుపుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను ఈసీ విస్మరిస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘ్ చట్ట విరుద్ధంగా నడుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. మరి ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ కుదింపు.. కాంగ్రెస్ హైకోర్టుకు వెళ్ళే యత్నాల వ్యవహారం ఎక్కడికి దారి తీస్తోందోననే ఉత్కంఠ రేపుతోంది.  
 

Similar News