హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభిమానులకు శుభవార్త చెప్పింది. తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది, అక్టోబర్ నెలలో సానియా మీర్జా అమ్మతనాన్ని ఆస్వాదించనుంది. పుట్టబోయే బిడ్డకు మీర్జామాలిక్ అని పేరు పెట్టాలని షోయబ్ మాలిక్, సానియా మీర్జా డిసైడ్ అయ్యారు.
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్- ఇండియన్ టెన్నిస్ దిగ్గజం సానియామీర్జా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. 31 ఏళ్ల సానియా ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. సానియా, షోయబ్ ఇద్దరూ తమ చిన్నారి ఆగమనాన్నిసూచిస్తూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే ఫొటోను పోస్ట్ చేశారు. వార్డ్‌రోబ్‌లో ఎడమవైపు సానియా టీ షర్ట్, కుడి వైపు షోయబ్ టీ షర్ట్ ఉండగా మధ్యలో మీర్జా-మాలిక్ పేరిట చిన్నారి డ్రెస్‌ను ఉంచారు.
షోయబ్ మాలిక్- సానియా మీర్జా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని ఆమె తండ్రి, కోచ్ ఇమ్రాన్ మీర్జా తెలిపారు. అక్టోబర్ నెలలో సానియా తొలి సంతానానికి జన్మనిస్తుందని ధృవీకరించారు. బేబీ మీర్జా మాలిక్’ అంటూ సానియా చేసిన హ్యాష్‌ట్యాగ్‌కు అభిమానుల నుంచి తెగ లైక్స్, కామెంట్స్ వచ్చాయి. ఆమె దీన్ని పంచుకున్న గంటలోపే 54 వేల మంది లైక్ చేశారు. 1,502 మంది కామెంట్స్ చేశారు. అభిమానులు సానియాను శుభాకాంక్షల వెల్లువలో ముంచెత్తారు.
సానియా మీర్జా 2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్నారు. మోకాలి గాయంతో ఆమె గత అక్టోబర్ నుంచి ఆటకు దూరంగా ఉంది. తమ బిడ్డకు ఇద్దరి ఇంటి పేర్లు వచ్చేలా ‘మీర్జా మాలిక్’ అని పెడతామని కొద్ది నెలల కిందట సానియా తెలిపింది. షోయబ్ మాలిక్ అమ్మాయి కావాలనుకొంటున్నారని చెప్పింది. అయితే వచ్చే నెలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ ద్వారా పునరాగమనం చేస్తానని సానియా ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించింది. కానీ తాజా పరిణామంతో ఇక ఇంకా కొంతకాలం ఆమె టెన్నిస్‌కు దూరమవ్వడం ఖాయమైంది.
#BabyMirzaMalik ??❤️ pic.twitter.com/RTYpqok1Vl
— Sania Mirza (@MirzaSania) April 23, 2018