మిజోరంలో అధికార పీఠం ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ లెక్కలేంటి..?

Update: 2018-12-07 16:35 GMT

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరంలో ప్రాంతీయ పార్టీలదే హవా అని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి. అక్కడ ప్రాంతీయ  పార్టీలతోకలసి అధికారంలోకి రావాలన్న కమలనాథుల కలలు కల్లలవుతాయని సర్వేలంటున్నాయి. అధికార కాంగ్రెస్ కు ఓటమి ఖాయమని మిజో నేషనల్ ఫ్రంటే అక్కడ కీలకం కాబోతోందన్నది సర్వేల సారాంశం. మిజోరంలో కూడా ప్రభుత్వ వ్యతిరేకతే కాంగ్రెస్ పుట్టి ముంచింది ఇక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ కీలకమైన స్థానాలను గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. బ్రూ తెగ ఓటర్ల ఆందోళనలు, స్థానిక సమస్యలు, అక్కడి ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న భావన మిజో నేషనల్ ఫ్రంట్ కు మెరుగైన స్థానాలు కట్టబెడుతున్నాయన్నది ఎగ్జిట్ పోల్ సర్వేల సారాంశం.

 మొత్తం 40 సీట్లున్న మిజోరంలో ఎంఎన్ఎఫ్ 16 నుంచి 22 సీట్లు గెలుచుకుంటుందని కాంగ్రెస్ కు 8నుంచి 12 సీట్లు వస్తాయని ఇండియా టుడే సర్వే చెబుతోంది. ఇక్కడ మరో ప్రాంతీయ పార్టీ జెడ్ పీఎం 8 నుంచి 12 సీట్లు గెలుచుకుంటుందన్నది ఇండియా టుడే లెక్కల సారాంశం. రిపబ్లిక్ టీవీ కూడా 16 నుంచి 20 సీ2ట్లు మిజో నేషనల్ ఫ్రంట్ కు వస్తాయని ఊహిస్తోంది. కాంగ్రెస్ కు 14 నుంచి 18 సీట్లు జెడ్ పీఎం కు పది స్థానాలు, ఇతరులకు మూడు స్థానాలూ వస్తాయన్నది రిపబ్లిక్ టీవీ సర్వే అంచనా. న్యూస్ ఎక్స్ సర్వే ఎంఎన్ఎఫ్ కు  19 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కు 15 సీట్లు వస్తాయని ఇతరులు ఆరు స్థానాలు గెలుస్తారనీ అంచనా వేసింది. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో బిజెపి అధికారం సంపాదించిన విధంగానే మిజోరం లోనూ గెలుస్తామన్న  కమల నాథుల ఆశలు ఆవిరైపోయాయి కనీసం ఒక్క సీటు కూడా గెలుస్తాయన్న అంచనా ఏ సర్వేలు ఇవ్వకపోవడం విశేషం. 

Similar News