లీడర్లు కావలెను

Update: 2018-04-11 06:56 GMT

ప్రశ్నిస్తానంటూ ప్రజల్లోకి వచ్చిన పార్టీకి ప్రజా ప్రతినిధులు కరువయ్యారు. బయోడేటాలు పట్టుకుని మరీ ఇంటర్వ్యూలు చేసినా జనం ఆదరించే నేతలు కనిపించక పోవడంతో కొత్త వారి  కోసం అన్వేషణ ప్రారంభించింది. 2019 ఎన్నికలే లక్ష్యంగా తమ తరపున గళం వినిపించే సేనానుల కోసం వ్యూహారచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నేతలను ఆహ్వానించేందుకు జనసేన సిద్ధమైంది.  

జనసేన ఏర్పాటు చేసి నాలుగేళ్లయినా ప‌వ‌న్ త‌రువాత ఆస్థాయిలో చెప్పుదగ్గ  నేతలెవరూ క‌నిపించ‌క‌పోడం పార్టీకి పెద్ద మైన‌స్ గా మారింది. రోజువారీ రాజ‌కీయ అంశాల‌పై పార్టీ స్టాండ్ వినిపించే నాయ‌కుల కొర‌త పార్టీలో స్పష్టంగా క‌నిపిస్తోంది. ప్రస్తుతం ప‌వ‌న్ వెంట ఉన్న వాళ్లంతా పెద్దగా చ‌రిష్మ లేని వారే. దీంతో  పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే నేతల కోసం అధినేత పవన్ కళ్యాణ్ అన్వేషిస్తున్నారు. 

ఎలాంటి అధికార పదవి లేకపోయినా పవన్ వాయిస్ ను బలంగా వినిపించే దిలీప్ సుంకర పార్టీని వీడటం పెద్దలోటుగా జనసేనాని భావిస్తున్నారు. పార్టీలోకి తిరిగి ఆహ్వానించేందుకు తానే స్వయంగా సమావేశం కావాలని భావిస్తున్నట్టు సమాచారం. హోదా అంశంపై 20 రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన పవన్ తనతో 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు అటు టీడీపీలో కాని ఇటు వైసీపీలో కాని ఒక్క ఎమ్మెల్యే కూడా పవన్ కు అనుకూలంగా మాట్లాడకపోవడం ఈ అంశం మరుగున పడింది.   

పార్టీలో నేతల కొరత ఉన్న మాట వాస్తవమేనంటూ ఓ వైపు చెబుతునే తమను తాము  ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు జనసేన నేతలు. ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు పలువురు నేతలు సిద్ధమైనా తామే ఆచితూచి అడుగులు వేస్తున్నామంటూ చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ వాయిస్ వినిపించే నేతలు లేకపోతే కార్యకర్తలు, ప్రజలకు మధ్య దూరం పెరుగుతుందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికలపై తమకు స్పష్టమైన అవగాహన ఉందని చెబుతూనే  పార్టీ చేరికలపై అధినేత పవన్ కళ్యాణ్ దే తుది నిర్ణయమంటున్నారు.  

Similar News