ఐపీఎల్ -12 వేలం.. తొలిరోజునే రికార్డుల మోత

Update: 2018-12-18 13:30 GMT

ఐపీఎల్ 12వ సీజన్ వేలం జైపూర్ వేదికగా సంచలనాలతో ప్రారంభమయ్యింది. మొత్తం 70 స్థానాల భర్తీ కోసం భారత్, విదేశీ క్రికెటర్లతో వేలం ప్రారంభించారు. 20 లక్షల కనీసధరతో వేలంలో ఉన్న భారత దేశవాళీ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి రికార్డుస్థాయిలో 8 కోట్ల 40 లక్షల రూపాయలు దక్కించుకొన్నాడు. మిస్టరీ స్పిన్నర్  వరుణ్ ను కింగ్స్ లెవెన్ పంజాబ్ ఈ మొత్తానికి సొంతం చేసుకొంది. మరోవైపు గత సీజన్ వేలం టాపర్, లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కు 8 కోట్ల 50 లక్షల రూపాయల ధరతో రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకొంది. కోటీ 50 లక్షల కనీస ధరతో ప్రారంభమైన ఉనద్కత్ వేలం చివరకు 8 కోట్ల 50 లక్షల రూపాయల ధరతో ముగిసింది. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 4 కోట్ల 80 లక్షల రూపాయల ధరకు దక్కించుకొంది. లంబూ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ కోటీ 10 లక్షల ధరకే ఢిల్లీ జట్టులో చేరాడు. 

టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు, ఆంధ్ర రంజీ కెప్టెన్ హనుమ విహారిని ఢిల్లీ ఫ్రాంచైజీ 2 కోట్ల రూపాయల ధరకు సొంతం చేసుకొంది. వెస్టిండీస్ టీ-20 కెప్టెన్ కార్లోస్ బ్రాత్ వెయిట్, టీమిండియా స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ లకు సైతం చెరో 5 కోట్ల రూపాయలు చొప్పున ధర పలికింది. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్, టెస్ట్ క్రికెటర్ చతేశ్వర్ పూజారాలను సొంతం చేసుకోడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోడం విశేషం.

Similar News