హంగ్‌లో కింగ్‌ ఎవరు? గవర్నర్‌ ఏం చేయబోతున్నారు?

Update: 2018-05-16 06:33 GMT

ఎన్నికల బరిలో హోరాహోరీ పోరు జరిగి వైరి వర్గాల్లో ఏ పక్షమూ మ్యాజిక్‌ అంకెను అందుకోలేకపోయిన ప్రతిసారీ అదే ఉత్కంఠ. ‘అందరి చూపూ.. రాజ్‌భవన్‌ వైపే. తాజాగా కర్ణాటకలో అదే పరిస్థితి ఏర్పండి. మెజార్టీ మార్క్ 112కు బీజేపీ 8సీట్ల దూరంలో ఆగిపోయింది. 38 సీట్లు సాధించిన జనతాదళ్ (ఎస్)కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ రెండు పార్టీల మొత్తం బలం 116 కాబట్టి మెజార్టీ మార్కు దాటినట్టే. అయితే, ప్రభుత్వం ఏర్పాటుకు ఎవర్ని ఆహ్వానించాలనే విషయంలో గవర్నర్ పాత్ర కీలకంగా మారింది. దీంతో గవర్నర్ ఏం చేస్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఒకప్పుడు బీజేపీవాది అయిన ప్రస్తుత కర్ణాటక గవర్నర్ వజూభాయ్ కుమారస్వామికి తొలి అవకాశం ఇస్తారా..? అన్నది ప్రశ్నార్ధకమే. పైపెచ్చు ఆయన ప్రధాని మోడీకి సన్నిహితుడు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్లో ఆర్థికమంత్రిగా పనిచేశారు. కుమారస్వామికి కనుక అవకాశమిస్తే బీజేపీకి దారులు మూసుకుపోయినట్టే. ఇప్పటికే ఒక దఫా యడ్యూరప్పతో మంతనాలు సాగించిన గవర్నర్.. సహజంగా ఆయనకే అవకాశం ఇస్తారని అన్ని పార్టీల్లో వినిపిస్తున్న మాట. రాజ్యాంగ నియమాలూ, సంప్రదాయాలూ పక్కనబెడితే గవర్నర్ విచక్షణ అన్న సిద్ధాంతం ఇప్పుడు కీలకమవుతుంది. ఆయన దాన్ని ఫాలో అయి తొలి ఛాన్స్ యడ్యూరప్పకు ఇస్తారని, తద్వారా కర్ణాటకలో బీజేపీ సర్కార్ ఏర్పడటానికి బాటలు వేస్తారని బీజేపీ శ్రేణులు ఆశావహంగా ఉన్నాయి. బల నిరూపణలో యడ్యూరప్ప విఫలమైతే కుమారస్వామికి అవకాశం దక్కుతుంది. 

మరోవైపు జేడీఎస్ సమైక్యంగా ఉండి అందులో చీలికలు రానిపక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడే పక్షంలో నిబంధనల ప్రకారం ఆ కూటమిని పిలవడం మినహా గవర్నర్‌కు మరో దారి లేదని చెబుతున్నారు న్యాయ నిపుణులు. మరి...కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. 

Similar News