ఫ్రంట్‌ రాజకీయాలు దేశాన్ని ఏ మలుపు తిప్పబోతున్నాయి?

Update: 2018-05-30 12:43 GMT

దేశ రాజకీయాలు భవిష్యత్తులో ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయా? జాతీయ పార్టీలకు దీటుగా బలమైన ప్రత్యామ్నాయ వేదిక రూపు దిద్దుకుంటోందా?  కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ స్టంట్ వెనక ఆ అదృశ్య శక్తి ఎవరు? కాంగ్రెస్, బిజెపిలకు సమదూరంలో ఓ కొత్త శక్తిని కూడగడుతున్న ఆ అజ్ఞాత వాసి ఎవరు? 
దేశ రాజకీయాల్లో భవిష్యత్తులో పెనుమార్పులు జరిగే ఆస్కారం కనిపిస్తోంది. జాతీయ పార్టీలకు దీటుగా,  పోటీగా ప్రాంతీయ పార్టీల కూటమి ఆవిర్భావం త్వరలోనే రూపు దిద్దుకునే అవకాశాలు గణనీయంగా కనిపిస్తున్నాయి. 

ఢిల్లీలో కొన్నాళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ప్రాంతీయ పార్టీల వేదిక ఏర్పాటు కసరత్తు వేగంగా రూపు దిద్దుకుంటోంది. దానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీయే వ్యూహకర్త అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అన్నీ కలిసొస్తే 2019 నాటికి ఫెడరల్ ఫ్రంట్ ప్రధాని అభ్యర్ధిగా ప్రణబ్ ముఖర్జీ తెర మీదకొచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి..గత కొంత కాలంగా ప్రణబ్ నేతృత్వంలో ఈకసరత్తు జరుగుతోంది.గత జనవరిలో బిజూపట్నాయక్‌ జీవిత చరిత్ర ఆవిష్కరణ సందర్భంగా.. భువనేశ్వర్‌లో ఒడిసా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌తో ప్రణబ్‌ ఒక విందు సమావేశం జరిపారు. దీనికి దేవెగౌడ,  సీతారాం ఏచూరి, ఎల్. కె.అడ్వానీ హాజరయ్యారు.. బిజూ పట్నాయక్ జీవిత చరిత్ర ఆవిష్కరణ పేరుతో జరిగిన ఈ మీటింగ్ లోనే మూడో ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు సుదీర్ఘంగా సాగాయి.

వాస్తవానికి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి పదవికన్నా ప్రధాని పదవిపైనే  ఆసక్తి ఉంది.. యూపిఏ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మన్మోహన్ ను రాష్ట్రపతిని చేసి తనను ప్రధానిగా చేస్తారని ఆశించినట్లు కానీ.. సోనియా అలా చేయలేదనీ ప్రణబ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ ని  ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన నేపధ్యంలో ఇక ఆ పార్టీ ద్వారా ప్రణబ్ ప్రధాని అయ్యే ఆస్కారం లేదు.. అందుకే మారుతున్న రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్, బిజెపిలకు సమదూరంలో  మూడో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు మంచిదనే ఆలోచనలో ఆయనున్నారు.. ప్రణబ్ ఒకరకంగా చెప్పాలంటే అజాత శత్రవు. ఆయనకు అన్ని పార్టీలనుంచి మిత్రులున్నారు.. ఈ నేపధ్యంలోనే 2019లో బిజెపికి లేదా ఎన్డీయేకి మెజారిటీ రాకపోతే ఈ మూడో ప్రత్యామ్నాయం అధికారం చేపట్టాలనే ఆలోచనలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ కి మళ్లీ అధికారం దక్కకూడదన్న పట్టుదలతో ఉన్న ఆరెస్సెస్ కూడా అందుకే ప్రణబ్ ను దువ్వుతోంది. తమ సంస్థ సమావేశానికి ప్రణబ్ ను ఆహ్వానించింది.దీనికి ప్రణబ్ కూడా సై అన్నారు..కేసిఆర్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీల పెద్దలందరినీ కలవడం ప్రణబ్ ఆలోచనలకు ఒక రూపమివ్వడంలో భాగమే.. 

జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ కి రుచించటం లేదు.. అలాగని ప్రణబ్ ను కట్టడి చేసే పరిస్థితీ లేదు. అన్నీ కుదిరితే ప్రణబ్ దాదా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తున్నట్లే లెక్క. ప్రణబ్ సూచనలతో ఏర్పాటయ్యే ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాలను శాసిస్తుందా? కాంగ్రెస్, బిజెపిలను అధికారానికి అల్లంత దూరంలో నిలువరించగలదా? సుస్థిర రాజకీయాలకు వేదిక కాగలదా? అందరూ కోరుకుంటున్నట్లు దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు వస్తుందా? ఇప్పుడివే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రశ్నలు.

Similar News