పురుగుమందు తాగి అత్తా కోడళ్ళు ఆత్మహత్య

Update: 2018-12-03 02:30 GMT

పొలం పనులు విషయంలో అత్తా కోడళ్ల మధ్య తలెత్తిన వివాదం ఇద్దరి ఆత్మహత్య కు దారి తీసింది. అత్తాకోడళ్ళు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది. కర్నూల్ జిల్లా సోమయాజులపల్లెకు చెందిన పట్నం చిన్న జమాల్, కళావతి దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడైన బాల వుశేనికి గడివేముల మండలం చిందుకూరు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మితో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. మరో కుమారునికి వివాహం కాలేదు.వీరందరూ ఉమ్మడిగా కలిసి ఉంటున్నారు. అయితే కొంతకాలంగా పొలం పనులు చేసే విషయంలో అత్తా, కోడళ్లు.. కళావతి , వెంకటలక్ష్మి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. 

ఈ క్రమంలో మనస్థాపం చెందిన అత్త కళావతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దాంతో ఆమెను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది కోడలు వెంకటలక్ష్మి. ఆరోగ్యపరిస్థితి మరింత విషమించి కళావతి మృతిచెందింది. అత్త మృతితో తనను ఏమైనా చేస్తారోనన్న భయంతో ఆమెకూడా పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించి ఆమెను కర్నూలుకు తరలిస్తుండగా  మార్గమధ్యలో మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అత్త పురుగుల మందు తాగిన సమయంలో ఆసుపత్రికి వచ్చిన కోడలు డబ్బాలో మిగిలిన మందు తాగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.