ఐటీ సోదాల వ్యవహారంలో మరో ట్విస్ట్

Update: 2018-10-01 09:40 GMT

ఐటీ సోదాల వ్యవహారంలో కొత్త విషయం వెలుగు చూసింది. ఓటుకు నోటు నిందితుడు ఉదయ సింహ చేసిన ఫిర్యాదుతో సోదాల్లో కొత్త కోణం బయట పడింది. ఐటీ అధికారుల పేరుతో నిన్న తన బంధువుల ఇళ్లల్లో సోదాలు చేశారని ఉదయ సింహ ఫిర్యాదు చేయగా ఆ ఘటనను అధికారులు తోసిపుచ్చారు. తాము నిన్న ఎలాంటి సోదాల చేయలేదని తేల్చి చెప్పారు. దీంతో ఉదయ సింహ బంధువుల ఇళ్లల్లో సోదాలు చేసింది ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

హైదరాబాద్ చైతన్య పురిలో ఉదయ సింహ బంధువు రణధీర్ రెడ్డి ఇంటికి నిన్న వచ్చిన 15 మంది తాము ఐటీ అధికారులమని చెప్పి సోదాలు చేశారని ఉదయ సింహ అంటున్నారు. తనిఖీలు ముగిశాక బంగారం, నగదు, సెల్ ఫోన్లు తీసుకెళ్లారని చెప్పారు. ఇదే విషయాన్ని ఐటీ అధికారులను వివరణ కోరితే తాము నిన్న ఎలాంటి సోదాలు జరపలేదని స్పష్టం చేశారు. మరి ఈ సోదాలు చేసింది ఎవరు..? ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? లేదంటే ఐటీ అధికారులు బాధ్యత వహిస్తారో లేదో చెప్పాలని ఉదయ సింహ డిమాండ్ చేశారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయ కుట్ర జరుగుతోందన్న అనుమానం వ్యక్తం చేశారు.

మరోవైపు ఇవాళ ఉదయం విచారణకు హాజరైన ఉదయ సింహపై ఐటీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఓటుకు నోటు వ్యవహారంతో పాటు ఆయన ఆదాయ వివరాలపై ప్రశ్నలు సంధించారు. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి  సమయం కావాలని ఉదయ సింహ కోరగా..అందుకు ఐటీ అధికారులు అంగీకరించారు. ఈ నెల 3న మరోసారి విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు ఆదేశించారు.
 

Similar News