కాషాయానికి, కాంగ్రెస్‌కు జీవన్మరణ యుద్ధం

Update: 2018-05-05 04:44 GMT

చావోరేవో సమరం. జీవన్మరణ యుద్ధం. ఆఖరిపోరాటం. ప్రతికూల అస్త్రాలు దూసుకువస్తున్న రణక్షేత్రంలో, మరి ఎలాంటి బ్రహ్మాస్త్రాలు సంధించాలి. ప్రత్యర్థిని ఎలా మట్టికరిపించాలి. ఏ ఆయుధాలు, ఏ వ్యూహాలు, అమలు చేయాలి. కర్ణాటక పోరులో, ఇప్పుడు కమలం సాగిస్తున్న సమర మేధోమథనం ఇదే. అందుకే అంతుచిక్కని వ్యూహాలను ఆఖరి నిమిషంలో ప్రయోగిస్తోంది. లీడర్లు, క్యాడర్‌కు అర్థంకాకుండా రహస్య అజెండాను తీసుకొస్తోంది. ఇంతకీ కమలదళం ప్రయోగిస్తున్న ఆ అస్త్రాలేంటి...ఆఖరిపోరాటంగా ఎందుకు భావిస్తోంది.

యుద్ధమంటే అస్త్రాలు, శస్త్రాలు, వ్యూహాలు ప్రతివ్యూహాలు. ఎత్తులుపైఎత్తులు. రామాయణ రావణకాష్టమైనా, మహాభారత కురుక్షేత్రమైనా, ఎవరి యుద్ధకౌశలం వారిదే. ఎవరి రణవ్యూహం వారిదే. ఎన్నికలు కూడా సమరమే. యుద్ధాన్ని మించిన వ్యూహాలతో, రక్తికడుతున్నాయి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, రుణాల మాఫీ, ప్రతి ఒక్కరికీ ఉద్యోగం. ఇదేంటి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్‌ ప్రకటించిన మ్యానిఫెస్టోలా ఉందనుకుంటున్నారా. తమిళనాడులో పార్టీలు వల్లెవేసే తాయిలాలని అనుకుంటున్నారా....కానీ ఇవన్నీ ఇప్పుడు కర్ణాటకలో ఓటర్లకు వేస్తున్న వల. ఆకర్షక గాలం. అదీకూడా, ఏ పార్టీ ఇలాంటి పథకాలను ఆఫర్ చేస్తోందో తెలుసా...బీజేపీ.. ఇలాంటి పథకాలకు బద్దవ్యతిరేకమనే భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి ఆ పార్టీ మ్యానిఫెస్టో చూస్తే, ఇది బీజేపీనా పక్కా తమిళనాడు ద్రవిడ పార్టీనా అనిపించకమానదు....తాయిలాలకు చెల్లుచీటి పాడాలని పిలుపునిచ్చిన పార్టీయేనా ఇది?

ఒకవైపు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, రుణాల మాఫీ అంటూ, సరికొత్త తాయిలాల వ్యూహాన్ని పట్టాలెక్కిస్తున్న బీజేపీ, మరోవైపు సామాజిక సమీకరణాలను మార్చేసే మరో ఎత్తుగడ కూడా వేసింది. ఏకంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వమే విస్తుపోయేలా, రహస్య అజెండాను చాపకిందనీరులా అమలు చేస్తోంది. రాష్ట్ర కాషాయదళానికి పెద్ద దిక్కును పక్కకు పెడుతూ, అవినీతి ఆరోపణల నాయకున్ని తెరపైకి తెస్తూ, సాహస విన్యాసం చేస్తోంది కాషాయదళం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలంటే, ఒక రాష్ట్రానికి సంబంధించినవి. కానీ సిద్దరామయ్య సంధిస్తున్న అస్త్రాలు, యడ్యూరప్ప చతికిలపడుతున్న తీరుతో, బీజేపీ తన వ్యూహాన్నే మార్చుకుంది. స్టేట్ ఎలక్షన్స్‌ను, నేషనల్‌ ఎలక్షన్స్‌గా మార్చేసింది. కన్నడగడ్డపై అడుగుపెట్టిన నరేంద్ర మోడీ, ఏకంగా రాహుల్‌ గాంధీపై విమర్శలు సంధించి, కర్ణాటక వార్‌ను ఢిల్లీ యుద్ధంగా తొడగొట్టారు. బీజేపీ ఎందుకు ఈ వ్యూహాన్ని ఎంచుకుంది?

Similar News