చీర దొంగపై వేటు

Update: 2018-08-10 06:33 GMT

బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి చీరమాయం వ్యవహారంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు కోడెల సూర్యలతపై వేటుపడింది. బోర్డు సభ్యురాలిగా ఆమెను తొలగిస్తూ దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అమ్మవారి సారె చీర మాయమైన వ్యవహారంలో జరిపిన శాఖాపరమైన విచారణలో సూర్యలతపై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్థారణ కావడంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి చీర మాయం కావడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నెల 5న ఆషాడ సారె సందర్భంగా ఉండవల్లికి చెందిన ఓ భక్తురాలు 18వేల రూపాయల విలువైన చీరను అమ్మవారికి సమర్పించింది. అయితే, ఆ చీరను పాలకమండలిలో సభ్యురాలిగా ఉన్న కోడెల సూర్యలత తీసుకెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. 

ఈ ఘటనపై ఆలయ ఈవో ఆధ్వర్యంలో ప్రభుత్వం విచారణ జరిపింది. దేవస్థాన సిబ్బంది, భక్తుల విచారణలో చీరను సూర్యకుమారి దొంగిలించినట్టు నిర్ధారణ అయ్యింది. సీసీ ఫుటేజీలో కూడా ఇదే రుజువైంది. దీంతో 1897 దేవాదాయ శాఖ చట్టం సెక్షన్ 28 ప్రకారం సూర్యలతను బోర్టు సభ్యురాలిగా ప్రభుత్వం తొలగించింది. 

దుర్గ గుడిలో వరుస వివాదాలపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పోలీసులు విచారణ చేపట్టి పురోగతి సాధించారు. భవిష్యత్‌లో అమ్మవారికి అపచారం కలిగించే పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. 
 

Similar News