ఒక్కడే 1045 పరుగులు బాదాడు!

Update: 2018-01-31 11:50 GMT

క్రికెట్‌లో శతకాలు సాధారణం.. డబుల్‌, ట్రిపుల్‌ సెంచరీలు అరుదు. కానీ, ఒకే మ్యాచ్‌లో ఒక్క ఆటగాడే వెయ్యి పరుగులు చేస్తే నమ్మగలమా. రెండేళ్ల కిందట ముంబై యువ క్రికెటర్ ప్రణవ్‌ ధన్‌వాడే స్కూల్‌ క్రికెట్‌లో 1009 రన్స్‌ చేసి దాన్ని నిజం చేశాడు. ఇప్పుడు మరో ముంబై టీనేజర్ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. తనిష్క్ గవాటె అనే 14 ఏళ్ల స్టూడెంట్.. స్థానిక క్రికెట్ టోర్నమెంట్‌లో ఏకంగా 1045 పరుగులు బాదాడు. ఈ విషయాన్ని అతని కోచ్ మనీష్ వెల్లడించాడు. కోపర్‌ఖైర్నెలోని యశ్వంత్‌రావ్ చవాన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ గ్రౌండ్‌లో జరిగిన టోర్నీ సెమీస్ మ్యాచ్‌లో తనిష్క్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. సోమ, మంగళవారాల్లో బ్యాటింగ్ చేసిన తనిష్క్.. ఏకంగా వెయ్యికిపైగా పరుగులు చేయడం విశేషం. 

ఈ గ్రౌండ్ చిన్నదేమీ కాదని, లెగ్‌సైడ్ 60 నుంచి 65 మీటర్లు, ఆఫ్‌సైడ్ 50 మీటర్లు ఉన్నదని అతని కోచ్ మనీష్ చెప్పాడు. అతని మారథాన్ ఇన్నింగ్స్‌లో మొత్తం 149 ఫోర్లు, 67 సిక్సర్లు ఉన్నాయి. అంటే కేవలం ఫోర్లు, సిక్సర్ల ద్వారానే అతను 998 పరుగులు చేశాడు. యశ్వంత్‌రావ్ చవాన్ టీమ్ తరఫున తనిష్క్ ఆడినట్లు మనీష్ చెప్పాడు. ఈ టోర్నీ పేరు నవీ ముంబై షీల్డ్ అండర్ 14. అయితే ఈ టోర్నీకి గుర్తింపు లేదని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే, కోచ్‌ మనోజ్‌ మాత్రం టోర్నీలో లెదర్‌ బాల్‌ ఉపయోగిస్తున్నామని, బౌలర్లు ఓవరార్మ్‌ బౌలింగ్‌ చేస్తున్నారని చెప్పాడు.

Similar News