కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్.. రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రెట్ల తగ్గింపు!

ఎస్‌బీఐ తన కస్టమర్లకు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఫిక్సెడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంక్ ఇప్పుడు తాజాగా రికరింగ్ డిపాజిట్లపై కూడా అదేరకమైన కోట విధించింది.

Update: 2019-09-18 03:20 GMT

వరుసగా డిపాజిట్లపై వడ్డీరేట్ల తగ్గింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫిక్సెడ్ డిపాజిట్ల(ఎఫ్డీ) పై వడ్డీరేట్లలో కోత వేసిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ల (ఆర్డీ)పై కూడా వడ్డీ రెట్లు తగ్గించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 10 నుంచే అమలులోకి రావడం గమనార్హం. ప్రతి నెలా కొంత మొత్తాన్ని దాచుకునే సామాన్యులకు ఇది చేదు వార్తగానే చెప్పొచ్చు.

స్టేట్ బ్యాంక్ రికరింగ్ డిపాజిట్లు (ఆర్‌డీ) 12 నెలల నుంచి 120 నెలల వరకు కాలపరిమితితో ఉన్నాయి. వీటిపై వడ్డీ రేటు 5.8 శాతం నుంచి 6.25 శాతం మధ్యలో ఉంది. ఇది సాధారణ కస్టమర్లకు వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లు ఈ వడ్డీ రేట్లపై అదనంగా 50 బేసిస్ పాయింట్ల ఎక్కువ వడ్డీ పొందొచ్చు.

ఎస్‌బీఐ ఏడాది రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఇప్పుడు ఈ డిపాజిట్లపై 5.8 శాతం వడ్డీ లభిస్తోంది. ఇది వరకు ఏడాది రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6 శాతంగా ఉంది.

అదేవిధంగా బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితిలోని ఆర్‌డీ అకౌంట్లపై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఇదివరకు ఈ డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీ లభించేది. అయితే ఇప్పుడు ఈ ఆర్‌డీలపై 6.5 శాతం వడ్డీ రేటు మాత్రమే పొందగలం. ఇంతేకాకుండా మధ్యకాల రికరింగ్ డిపాజిట్లపై కూడా ఎస్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. 3-5 ఏళ్ల కాలపరిమితిలోని డిపాజిట్లపై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు దిగొచ్చింది. ఇప్పుడు వీటిపై వడ్డీ రేటు 6.25 శాతంగా ఉంది.

ఇక దీర్ఘకాల రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఎస్‌బీఐ మార్చలేదు. వాటిని స్థిరంగానే కొనసాగించింది. 5 ఏళ్ల, 10 ఏళ్ల మెచ్యూరిటీ డిపాజిట్లపై ఇదివరకటి వడ్డీ రేటే కొనసాగుతుంది. వీటిపై కూడా వడ్డీ రేటు 6.25 శాతంగానే ఉంది. కాగా బ్యాంక్ ఇప్పటకే ఎఫ్‌డీ రేట్లు కూడా తగ్గించింది. 20-25 బేసిస్ పాయింట్ల మధ్యలో కోత విధించిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News