Maduro Gold Controversy: వెనిజులా నుండి ₹46,000 కోట్ల బంగారం తరలింపు వెనుక అసలు కథ!
ఆర్థిక సంక్షోభంలో మదురో $5.2B విలువైన బంగారాన్ని స్విట్జర్లాండ్‌కు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇటీవల అమెరికా కస్టడీలో ఉన్న వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోకు సంబంధించి కొన్ని సంచలన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మదురో పాలన ప్రారంభ సంవత్సరాల్లో వెనిజులా నుండి స్విట్జర్లాండ్‌కు రహస్యంగా తరలించబడిన బంగారానికి సంబంధించి, కస్టమ్స్ డేటా మరియు ఇంగ్లీష్ మీడియా జరిపిన పరిశోధనల ఆధారంగా కొన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
2013 నుండి 2016 మధ్య కాలంలో వెనిజులా సెంట్రల్ బ్యాంక్ నుండి సుమారు 113 మెట్రిక్ టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్‌కు తరలించినట్లు సమాచారం. అప్పట్లో దీని విలువ దాదాపు 5.2 బిలియన్ డాలర్లు (సుమారు ₹46,000 కోట్లు). ఆ సమయంలో వెనిజులా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నిధుల సమీకరణ కోసం వెనిజులా ప్రభుత్వం తన బంగారు నిల్వలను విక్రయించడం ప్రారంభించిందని, ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
స్విస్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం, అత్యవసర ఆర్థిక చర్యల కోసమే ఈ బంగారాన్ని బదిలీ చేశారు. అయితే, 2017 నుండి 2025 వరకు స్విట్జర్లాండ్ మరియు వెనిజులా మధ్య ఎటువంటి బంగారు లావాదేవీలు జరిగినట్లు కస్టమ్స్ రికార్డుల్లో లేదు. ముఖ్యంగా మదురో ప్రభుత్వంపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడమే ఇందుకు ప్రధాన కారణం. తాజాగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై అమెరికా మదురోను అరెస్టు చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. దీనికి ప్రతిస్పందనగా, స్విస్ అధికారులు మదురో మరియు అతని సన్నిహితులకు చెందిన ఆస్తులను స్తంభింపజేశారు. అయితే, ఆ ఆస్తుల మొత్తం విలువ ఎంత అనేది ఇంకా తెలియదు. వెనిజులా సెంట్రల్ బ్యాంక్ నుండి తరలించబడిన బంగారానికి, ఈ ఆస్తులకు ఏదైనా సంబంధం ఉందా? అనేది ఇప్పుడు ఒక కీలక ప్రశ్నగా మారింది.
దీనికి సంబంధించి వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకులు తరచుగా చేసే విధంగానే, బంగారాన్ని శుద్ధి చేయడానికి మరియు అంతర్జాతీయ ధృవీకరణ కోసం స్విట్జర్లాండ్‌కు పంపించి ఉండవచ్చని ఒక అంచనా. నిపుణురాలు రోనా ఓ'కానెల్ అభిప్రాయం ప్రకారం, మదురో బాధ్యతలు చేపట్టిన తర్వాత వెనిజులా సెంట్రల్ బ్యాంక్ భారీ ఎత్తున బంగారాన్ని విక్రయించింది, అందులో ఎక్కువ భాగం స్విట్జర్లాండ్ ద్వారానే జరిగింది. కొన్ని లావాదేవీలు బంగారు రూపంలోనే సెటిల్ అయ్యాయని, మిగిలిన భాగాన్ని చిన్న బిస్కెట్లుగా మార్చి ఆసియా మరియు ఇతర ప్రపంచ మార్కెట్లలో విక్రయించారని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది మరియు ఆస్తులు ఇంకా స్తంభింపజేసే ఉన్నాయి. వెనిజులా బంగారం ఉనికి మరియు మదురో విదేశీ సంపదతో దానికి ఉన్న సంబంధం, వెనిజులా ఆర్థిక పతనం వెనుక ఉన్న అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా నిలుస్తోంది