పెట్రోలుపై 10, డీజిలుపై 13 రూపాయలు : ఎక్సైజ్ డ్యూటీని పెంచిన కేంద్రం!

Update: 2020-05-06 01:15 GMT
representational image

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచింది. పెట్రోల్ పై లీటరుకు 10 రూపాయలు, డీజిల్ పై లీటరుకు 13 రూపాయలు ఈ పెంపుదల ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి అదనంగా 1.6 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో దాని ప్రభావం దేశీయంగానూ పడింది. అయితే, ఆ లాభాలను కంపెనీల వద్దే ఉండిపోతున్నాయి. దీంతో దానిని సరి చేసుకోవడానికి ఈ పెంపుదల చేశారు. దీని వలన వినియోగదారులపై అదనంగా భారం పడే అవకాశం లేదు. 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్స్, కస్టమ్స్ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్ పై స్పెషల్ ఎడిషనల్ టాక్స్ లీటరుకు 2 రూపాయలు, రోడ్ సెస్సు లీటరుకు 8 రూపాయలు పెరిగింది. అదేవిధంగా డీజిల్ పై స్పెషల్ ఎడిషనల్ టాక్స్ లీటరుకు 5 రూపాయలు, రోడ్ సెస్ లీటరుకు 8 రూపాయలు పెరిగింది. 

దీంతో మొత్తమ్మీద పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ 32.98 రూపాయలు, డీజిలు పై 31.83 రూపాయాలకు చేరుకుంది. 

ఇలా పెట్రోల్, డీజిల్ పై సుంకాన్ని పెంచడం ఈ సంవత్సరంలో ఇది రెండోసారి. మార్చి నెలలో పెట్రోలు, డీజిలు రెండిటిపై లీటరుకు 3 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. దీంతో కేంద్రానికి 39 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 


Tags:    

Similar News