నేడు నీతి ఆయోగ్ సమావేశం.. ప్రత్యేకహోదా, విభజన హామీలను ప్రస్తావించనున్న జగన్‌

Update: 2019-06-15 01:59 GMT

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలే లక్ష్యంగా నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరవుతానని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల‌న్న అంశంపై ప్ర‌ధాని మోడీని ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తానని తెలిపారు. తర్వాత పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైసీపీ ఎంపీలతో జగన్‌ సమావేశం అవుతారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారు.

రాష్టప్రతి భవన్‌లో ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ ఐదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ హాజరుకానున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఆయువు పట్టైన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయాలనే నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రస్తావిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి ఎంత అవసరమన్న విషయాన్ని ప్రధానికి వివరిస్తానని తెలిపారు. గతంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇవ్వొద్దని నీతి ఆయోగ్‌ చెప్పిందని, అందుకే ఇవ్వలేకపోతున్నట్లు కేంద్రం వాదిస్తుందని జగన్‌ గుర్తు చేశారు. అసలు రాష్ట్రానికి హోదా ఎందుకు కావాలనే విషయాన్ని నీతి ఆయోగ్‌కు వివరించడానికి నివేదిక సిద్ధం చేసుకున్నట్లు జగన్‌ చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మనసు కరిగేంత వరకు తన ప్రయత్నాలు కొనసాగుతాయని జగన్‌ చెప్పారు. ఇదే అంశంపై హోంమంత్రి అమిత్‌ షాను కలిశానన్న జగన్‌ ఓ మంచి మాట ప్రధానికి చెప్పాలని కోరినట్లు జగన్‌ చెప్పారు.

తర్వాత జగన్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికల్లో 22 మంది ఎంపీలుగా గెలుపొందడంతో లోక్‌సభలో నాలుగో పెద్ద పార్టీగా వైసీపీ ఆవిర్భవించింది. ఈ నెల 17 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలకు జ‌గ‌న్‌ దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్‌లో పార్టీ వైఖరి ఎలా ఉండాలన్నదానిపై ఎంపీలకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ సమావేశానికి వైసీపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన 22 మంది ఎంపీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు హాజరవుతారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, కేంద్ర నిధులు, ఇతర అంశాలపై ఉభయ సభల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై పార్టీ ఎంపీలతో చర్చిస్తారు. పార్లమెంట్‌ ప్రసంగాల్లో ఏయే అంశాలు ప్రస్తావించాలి వేటిపై ఎలా మాట్లాడాలన్నది జగన్‌ వివరించనున్నారు. 

Tags:    

Similar News