రైతులకు చల్లటి కబురు.. నేడు ఏపీలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు

Update: 2019-06-18 01:49 GMT

నైరుతి రుతపవనాలు ఎట్టకేలకు తెలుగురాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇవాళ ఏపీలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే మూడు రోజుల్లోపు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిస్తాయని వీటి ప్రభావంతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఆ తర్వాత తెలంగాణకు కూడా వ్యాపిస్తాయని వెల్లడించింది. మొత్తానికి తొలకరికి సమయం ఆసన్నమైంది. జూన్‌ మొదటివారంలో రావాల్సిన నైరుతి రుతుపవనాలు ఇవాళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సుమారు 15 రోజులు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు విస్తరించేందుకు అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుపాను అడ్డంకిగా మారింది. దీంతో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించడంలో ఆలస్యమైంది. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి బలపడతాయని దీని ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది.

ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల వాయువు ఏర్పడుతోందని రానున్న రోజుల్లో ఇది మరింత బలపడుతుందని అధికారులు చెప్పారు. ఈ తరహా వాతావరణం ఏర్పడినప్పుడు ఆకాశంలో మబ్బులు ఏర్పడి ఆ తర్వాత క్రమంగా వర్షాలు కురవడం ప్రారంభమవుతుందని వివరించారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వర్షాలు కురిసే సమయంలో భారీగా గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి రుతుపవనాలు వస్తున్నాయన్న కబురుతో అన్నదాతలు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

Tags:    

Similar News