ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం

Update: 2019-06-13 04:23 GMT

ఏపీ అసెంబ్లీ రెండోరోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన సభ్యుడిగా గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. స్పీకర్‌ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు. 15వ శాసనసభ తొలిరోజు ఎమ్మెల్యేల పదవీ ప్రమాణస్వీకారంతోపాటు స్పీకర్‌ ఎన్నికకు కూడా నోటిఫికేషన్‌ను జారీ చేశారు. సాయంత్రం ఐదు గంటలలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా తమ్మినేని నామినేషన్‌ ఒక్కటే దాఖలైంది. తమ్మినేని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పలువురు మంత్రులతో సహా 30 మంది ఎమ్మెల్యేలు నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. తమ్మినేని ఆముదాలవలస ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు సార్లు మంత్రిగా పని చేశారు. స్పీకర్ ఎన్నికకు ప్రతిపక్షం మద్దతు కూడా తీసుకోనున్నారు.ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభలో 173 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం నిరాడంబరంగా, సంప్రదాయబద్ధంగా పూర్తయిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News