తెలంగాణలో కొండెక్కిన ఉల్లి ధరలు

Update: 2019-11-10 01:37 GMT
Onion prices

తెలంగాణ వ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కాయి. ప్రస్తుతం సామాన్యుడికి ఉల్లి అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పుడే కాదు రానున్న రోజుల్లో ఉల్లి కొనాలంటేనే ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. ఇటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చూస్తే ఉల్లిసాగు గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా దేవరకద్ర, నారాయణపేట, అలంపూర్ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉల్లి సాగయ్యేది. ఈసారి తక్కువ శాతం సాగు చేసినట్టు తెలుస్తోంది.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులు ఎక్కువగా దేవరకద్ర, మహబూబ్‌నగర్ మార్కెట్లకు ఉల్లిని విక్రయానికి తరలిస్తారు. మార్చి నెలలోనే ఉల్లి ఎక్కువగా మార్కెట్‌కు వస్తుంది. అయితే, గత మార్చిలో ఆశించినంతగా ఉల్లి మార్కెట్‌లోకి రాలేదు. మహబూబ్‌నగర్ మార్కెట్‌లోకి ప్రతిసారి వెయ్యి నుంచి రెండు వేల క్వింటాళ్ల ఉల్లి వచ్చేది. కానీ, ఈ ఏడాది మార్చి వరకూ కేవలం 560 క్వింటాళ్ల ఉల్లి మాత్రమే మార్కెట్‌కు వచ్చింది. అయితే, ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో మార్చిలో ఎన్ని క్వింటాళ్ల ఉల్లి వస్తుందో మార్కెట్ కమిటీ కచ్చితంగా అంచనా వేయలేకపోతుంది.

జిల్లాలోనే అత్యధికంగా ఉల్లిసాగు జరిగే దేవరకద్ర నియోజకవర్గంలోనూ ఈ ఏడాది సాగు తగ్గింది. ఇప్పటికే కొంతమంది రైతులు సాగు చేసి క్వింటాకు 2 నుంచి 3వేల వరకూ విక్రయించారు. మరికొందరు రైతులు ఇప్పుడు సాగు చేపట్టారు. గతేడాది దేవరకద్ర మార్కెట్ యార్డులో 2,384 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ చూస్తే 4వేల 548 క్వింటాలల్ ఉల్లి కొనుగోలు జరిగింది. అయితే, ఉల్లి ధర ఇప్పుడు బాగుందని, తాము సాగు చేసి మార్కెట్‌లోకి తరలించాక కూడా ధర ఇలాగే ఉంటే బాగుండని అంటున్నారు ఉల్లి రైతులు.

ఇక నారాయణపేట, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోనూ ఈ ఏడాది ఉల్లిసాగు గణనీయంగా తగ్గింది. అయితే, మార్చి నాటికి సాగు చేతికి వచ్చే అవకాశం కనిపిస్తుండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంత దిగిబడి వచ్చేది, మార్కెట్లలోకి ఎన్ని క్వింటాళ్లు వచ్చేది తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్క దేవరకద్ర నియోజకవర్గం మినహాయిస్తే.. మిగతా ఏ నియోజకవర్గంలోనూ ఈ ఏడాది ఆశించినంత ఉల్లిసాగు జరగనట్టు తెలుస్తోంది. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఉల్లి ధరలు మళ్లీ మరింత కొండెక్కి కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది.  

Tags:    

Similar News