స్త్రీ లేకపోతే సృష్టే లేదు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

Update: 2020-03-08 11:53 GMT
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (ఫైల్ ఫోటో)

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు అవకాశాలు కల్పిస్తే పురుషుల కంటే గొప్పగా రాణిస్తారని ఆయన అన్నారు.

ప్రతీ తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను పాఠశాలకు పంపించాలని, వారికి మంచి విద్యాబుద్దులు నేర్పించాలని మహిళా దినోత్సవం సందర్భంగా తాను విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. మహిళా సాధికారతలో మహిళలు మంచి పురోభివృద్ధి సాధిస్తున్నారని, అయినప్పటికీ ఇంకా ఎంతో సాధించాలని, ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉందని ఆయన తెలపారు.

వ్యక్తిగత విశ్వాసాలు, విలువలు, వైఖరులు మహిళా సాధికారతలో ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. దీని కోసం ముందు సమాజంలో మార్పు రావాలని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారత అనే విషయాన్ని అనేక కోణాల్లో ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రతి మహిళకు ఎంతైనా ఉందని తెలిపారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తే వారు ప్రతీరంగంలోనూ రాణిస్తారన్నారు.

దేశాభివృద్ధికి మహిళా సాధికరత ఎంతో ముఖ్యమని తెలిపారు. భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన అన్ని శాఖలను మనవాళ్లు మహిళలకు కేటాయించారని, అందులో ముఖ్యంగా ఆర్థికశాఖ మంత్రి లక్ష్మీదేవి, రక్షణశాఖ మంత్రి పార్వతిదేవీ, విద్యాశాఖ మంత్రి సరస్వతిదేవీ ఇలా అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని తెలిపారు. మహిళలు సృష్టిలో సగభాగం అని తెలిపారు. మంచిచేసిన వాళ్లను గుర్తుపెట్టుకుని సత్కరించడం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. స్త్రీ లేకపోతే సృష్టే లేదన్నారు. సమస్త జగత్తుని నడిపించేది మహిళలే అని ఈ సందర్భంగా ఆయన మహిళల గురించి మాట్లాడారు.

Tags:    

Similar News