మరింత మెరుగ్గా ఆన్‌లైన్‌ బోధన చేపట్టండి: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్

ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు అవుతుండడంతో విద్యాసంస్థలన్నీ మూతపడి జరగాల్సిన పాఠాలన్నీ ఆగిపోయాయి.

Update: 2020-04-25 05:13 GMT
Telangana Governor Tamilisai Soundararajan (File Photo)

ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు అవుతుండడంతో విద్యాసంస్థలన్నీ మూతపడి జరగాల్సిన పాఠాలన్నీ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నత విద్యా సంస్థల్లో ఆన్‌లైన్‌ బోధనను మరింత మెరుగుపర్చాలని ఆమె తెలిపారు. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన పాఠాలన్నింటినీ ఆన్ లైన్ పద్ధతిలో విద్యార్థులకు బోధించాలని తెలిపారు. దీని ద్వారా విద్యార్థులకు పరీక్షలు రాసే సమయంలో ఒత్తిడి లేకుండా ఉంటుందని, పాఠాలు పూర్తయిన తరువాత పరీక్షల నిర్వహణ వంటి చర్యలు చేపట్టాలని యూనివర్సిటీ రిజిస్టార్లకు సూచించారు. యూనివర్సిటీల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు నిర్వహించే రక్తదాన శిబిరాల నిర్వహణను రెడ్‌క్రాస్‌ సొసైటీ సమన్వయంతో చేపట్టాలన్నారు. కోవిడ్ 19 సమాచారం కోసం విద్యార్థులంతా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని గవర్నర్ విద్యార్థులకు సూచించారు.

అనంతరం రిజిస్టార్లు గవర్నర్ తో మాట్లాడుతూ ఆన్ లైన్ తరగతులకు మంచి స్పందన లభిస్తుందని, 70–80 శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నారని తెలిపారు. గ్రామీన ప్రాంతాలకు చెందిన విద్యార్థుల కొన్ని అసౌకర్యాల కారణంగా వారు హాజరు కాలేకపోతున్నారని తెలిపారు. ఇప్పటికే డిగ్రీ సిలబస్ సుమారుగా 80శాతం పూర్తయిందని, అదే విధంగా పీజీ సిలబస్ కూడా 80 నుంచి 90 శాతం వరకు పూర్తయిందని వివరించారు.

ఇక డిగ్రీలో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల డిటెన్షన్‌ ఎత్తివేతపై ప్రభుత్వ ఆమోదం గురించి ఎదురుచూస్తున్నామని, అది రాగానే డిటెన్షన్ ఎత్తివేత ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి గవర్నర్ తో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ తర్వాత రెండు మూడు వారాల్లో వార్షిక పరీక్షల నిర్వహణ, ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడతామని స్పష్టం చేసారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూ రిజిస్టార్‌ ఎ.గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News