అలవోకగా.. ఆడుతూ పాడుతూ: ఐపీఎల్ ఫైనల్లో చెన్నై

Update: 2019-05-10 17:54 GMT

అసలే గెలుపు దాహం.. ఆపైన అచ్చొచ్చిన మైదానం.. అవతలి పక్క ఉన్నది కుర్రాళ్లు.. ఓటమి నుంచి గెలుపు కోసం కసితో కూడిన ప్రయాణం ఇన్ని అంశాలు ఉండగా విజయం సాధించడం కష్టం కాదు కదా. ఇపుడు అదే జరిగింది. అనుభవంతో చన్నై.. కుర్ర జోరుతో ఢిల్లీ రెండూ ఫైనల్ కోసం రెండోసారి తలపడ్డాయి. ఇక్కడ అనుభవానిదే పైచేయి అయింది. విశాఖపట్నంలో ధోనికి ఎపుడూ తిరుగుండదు. ఆ చరిత్ర తిరగరాశే అవకాశం ఢిల్లీకి ధోనీ ఇవ్వలేదు.

ఐపీఎల్ 2019 రెండో ఫైనలిస్టును నిర్ణయించే మ్యాచులో ధోనీ సేన ఆడుతూ..పాడుతూ.. విజయం సాధించింది. ఎన్నాళ్ల నుంచో ఐపీఎల్ ఫైనల్స్ లో ఆడాలని.. కప్పు గెలవాలని కలలు కంటున్న ఢిల్లీ జట్టు ఆఖరి మెట్టుపై తదబ్యాటుతో చతికిలపడింది. 12 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో పది సార్లే టోర్నమెంట్ లో ఆడిన చెన్నై 8 సార్లు ఫైనల్ కు చేరింది. ఇక ముంబయి కి పెద్ద సవాలే ఎదురవుతున్నట్టే . ఇపుడు ఆదివారం ముంబయి, చెన్నై జట్ల మధ్య హైదరాబాదులో రసవత్తర తుది పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక విశాఖలో రెండో క్వాలిఫయింగ్ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 147 పరుగులు మాత్రమే చేసింది. స్వల్పమైన స్కోరును అలవోకగా చెన్నై జట్టు ఛేదించి.. అరువికెట్ల తేడాతో గెలిచి ఫైనల్స్ కు అర్హత సాధించింది. ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ (50), డుప్లెసిస్‌(50) చెలరేగి పోయారు. అద్భుతమైన షాట్లతో అర్ధశతకాలు సాధించారు. అయితే, వారు తొలి 4 ఓవర్లకు చేసిన స్కోరు 16 పరుగులే! ఐదో ఓవర్‌ నుంచి వారిద్దరి బ్యాట్లు గాల్లో ఊగుతూనే ఉన్నాయి. మొదట డుప్లెసిస్‌ చితకబాది అర్ధశతకం సాధించాడు. జట్టు స్కోరు 81 వద్ద బౌల్ట్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వాట్సన్‌ వంతు. ముందే అనుకున్నట్టుగా 50 కొట్టగానే అతనూ వెనుతిరిగాడు. అప్పుడు స్కోరు 109. అప్పటికే విజయం చెన్నై వైపు మొగ్గడంతో ఇబ్బంది లేకపోయింది. రైనా (11), అంబటి రాయుడు (20*) నిలకడగా ఆడారు. ఎంఎస్‌ ధోనీ (9) జట్టు రెండు పరుగులు చేస్తే విజయం సాధిస్తుందనగా గెలుపు షాట్‌ ఆడబోయి వెనుదిరిగాడు. 

Similar News