టీం ఇండియా ప్రపంచ కప్ గెలవడం కష్టమే : జాంటీ రోడ్స్

Update: 2019-05-13 13:46 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ ఘనంగా ముగిసింది.ఇక అందరూ ఐపీఎల్ ఫీవర్ నుంచి బయటపడి ప్రపంచకప్ గురించి ఆలోచిస్తున్నారు. ధోనీ సారథ్యంలో 2011లో ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న టీం ఇండియా ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.

అయితే టీం ఇండియాలో అత్యుత్తమైన 15 మంది ఆటగాళ్లు ఉన్నా.. ఆ జట్టుకు ప్రపంచకప్‌ను సొంతం చేసుకొనే సత్తా లేదని సౌతాఫ్రికా ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డారు. క్రికెట్ ప్రపంచకప్ ఈసారి రౌండ్-రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. అంటే ప్రతీ జట్టు ఇతర తొమ్మిది జట్లతో ఒక్కొ మ్యాచ్ ఆడాల్సిందే. ఈసారి మొత్తం 10 జట్లు ప్రపంచకప్‌కి అర్హత సాధించాయి. అయితే 1983లో, 2011లో ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న టీం ఇండియా ఈసారి ప్రపంచకప్ గెలవడం కష్టపమని రోడ్స్ పేర్కొన్నారు.

''టీం ఇండియాలో 15 మంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ, ఇంకో ఆరు జట్లు అలాగే ఉన్నాయి. ఈసారి ప్రపంచకప్‌ బరిలో దిగే జట్లు అన్నీ బలమైనవే. మ్యాచ్ జరిగే రోజు ఉండే పరిస్థితులే ఫలితాన్ని నిర్దేశిస్తాయి. భారత్‌‌తో ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. అలాగని వేరే జట్లలో లేరని కాదు. సరిగ్గా ఆడే 11 మంది ఆటగాళ్లు ఏ జట్టులో ఉంటే విజయం వారిదే. భారత్‌లో బుమ్రాలాంటి మంచి బౌలర్లు ఉన్నారు. వాళ్లు డెత్ ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేయగలరు. ఇక హార్థిక్ పాండ్యా కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్స్‌మెన్‌గా, బౌలర్‌గా అతను రాణిస్తున్నాడు. భారత్ విజయంలో అతనిది కీలక పాత్ర. కానీ టీ-20 ఫార్మాట్‌ని వన్డేలతో పోల్చలేము'' అని రోడ్స్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. టీం ఇండియా జూన్ 5వ తేదీన ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ సౌతాఫ్రికాతో ఆడనుంది.

Similar News