అకౌంట్‌లో సరిపడా డబ్బుల్లేవ్‌.. కానీ భయపడను : విజయ్ దేవరకొండ

Update: 2020-04-27 11:22 GMT

విజయ్ దేవరకొండ చేసింది కొన్ని సినిమాలే అయిన స్టార్ హీరోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే టాలీవుడ్ రౌడీగా పేరు తెచ్చుకున్నారు. 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ అర్జున్‌రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్లు కొట్టారు. రీల్ లైఫ్ లోనే కాకుండా రియ‌ల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతోన్న సామాన్యులకు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చారు.

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన విజయ్ దేవరకొండ‌ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేయాలనే లక్ష్యంతో ఓ మంచి కార్యక్రమంతో ముందుకు వచ్చారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ పూర్తయ్యాక చాలామంది ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయని వార్తలు వస్తోన్న నేపథ్యంలో తన వంతుగా కొందరికి ఉద్యోగాలు కల్పించే విషయంలో సాయం చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను షేర్‌ చేశారు.

మిస్ యూ ఆల్ అంటూ వీడియో స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ మీరంతా జాగ్రత్తగా ఉండాలంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. కరోనా అందరినీ దెబ్బ కొట్టిందని బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితులకు నేను మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా లేనని అకౌంట్‌లో సరిపడా డబ్బుల్లేవని తెలిపారు. తన కుటుంబంతో పాటు 35 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు విజయ్ దేవరకొండ.‌

లాక్ డౌన్ లో సినిమాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లోనూ ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా కోటి 30 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు విజయ్ దేవరకొండ. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి కుటుంబాలకు సాయం చేసేందుకు 25 లక్షల రూపాయలతో మిడిల్‌ క్లాస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశారు. మిగిలిన డబ్బులను భవిష్యత్ లో ఉద్యోగాలు కల్పించేందుకు వినియోగిస్తానని చెప్పారు విజయ్.

విజయ్ దేవరకొండ ఏర్పాటు చేసిన ఎంసీఎఫ్ కోసం RX 100 ఫేమ్‌ కార్తికేయ ల‌క్ష రూపాయల విరాళం అందించారు. ఇక కొర‌టాల శివ ప‌దిమందికి తోడుగా ఉండే ప‌నుల్లో నీకు తోడుగా నేనుంటా అంటూ ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News