రాళ్లపల్లి మృతి వార్తతో సినీలోకం దిగ్భ్రాంతి

Update: 2019-05-17 16:23 GMT

తెలుగు సినీ ప్రేక్షకులను ఐదు దశాబ్దాలకుపైగా ఆకట్టుకొన్న ప్రముఖ నటుడు, డ్యాన్స్ డైరెక్టర్ రాళ్లపల్లి ఇకలేరు. మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ ఈ సాయంత్రం 6గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. సుమారు 850పైగా చిత్రాల్లో రాళ్లపల్లి నటించారు.

రాళ్లపల్లి పూర్తిపేరు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు. రాళ్లపల్లి తూర్పు గోదావరి జిల్లాలోని రాచపల్లిలో జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఓ కుమార్తె ఇప్పటికే స్వర్గస్తులయ్యారు. మరో కుమార్తె అమెరికాలో ఉన్నారు. ఆమె హైదరాబాద్‌కు చేరుకొన్న తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. సినీ పరిశ్రమలో ఎన్నో అవార్డులు అందుకొన్నారు రాళ్లపల్లి. రాష్ట్ర నంది పురస్కారాన్ని మూడుసార్లు అందుకొన్నారు రాళ్లపల్లి. అలాగే 1976లో ఊరుమ్మడి బతుకులు చిత్రంలో అద్భుతమైన ప్రతిభకు ఉత్తమ కామెడీ నటుడిగా జాతీయ అవార్డును అందుకొన్నారు రాళ్లపల్లి. గణపతి అనే సీరియల్‌లో ఉత్తమ సహయనటుడిగా నంది అవార్డును పొందారు రాళ్లపల్లి.

కుక్కకాటుకు చెప్పుదెబ్బ చిత్రంతో రాళ్లపల్లి నట జీవితాన్ని ప్రారంభించారు. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో నటించారు. బొంబాయి, మిన్సారా కన్నవు అనే తమిళ చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా అన్ని రకాల పాత్రలను పోషించి మెప్పించారు. తూర్పు వెళ్లే రైలు, సీతాకోక చిలుక, శుభలేఖ, ఖైదీ, ఆలయ శిఖరం, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, అన్వేషణ, కూలీ నెంబర్ 1, ఏప్రిల్ ఒకటి విడుదల లాంటి హిట్ సినిమాల్లో కీలక పాత్రలను పోషించారు. ఆయన నటించిన చివరి చిత్రం భలే భలే మొగాడివోయ్. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2015లో విడుదలైంది.

Similar News