రాజమౌళి+రామ్ చరణ్+(NT)రామారావు @ RRR(రౌద్రం రణం రుధిరం) అదరగొట్టిన మోషన్ పోస్టర్!
ఒక దర్శక ధీరుడు.. మగధీరుడు.. నెం1 స్టూడెంట్ ఈ ముగ్గురూ కలిస్తే.. వెండితెరకు ఎటువంటి వెలుగు వస్తుందో తెలుసా? వీరి ముగ్గురి కలయికలో వచ్చే సినిమా ఎలా ఉంటుందో తెలుసా? జస్ట్ ఉగాది సందర్భంగా వచ్చిన మోషన్ పోస్టర్ చూస్తె అర్థం అవుతుంది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి మూడు Rలు పక్క పక్కన కనిపిస్తే ఎలా వుంటుందో టైటిల్ లోనే చూపించేశారు. ఎస్.. ఇదంతా రాజమౌళి.. రామారావు.. రామ్ చరణ్ ల తాజా సినిమా గురించే. ఆర్ ఆర్ ఆర్ పేరు తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పై అందరికీ ఎంతో ఆసక్తి ఉంది. అభిమానులైతే రకరకాల టైటిల్స్ తో ఆర్ అర్ ఆర్ కి అర్థం చెప్పేశారు. ఇప్పుడు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.
సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న'ఆర్ఆర్ఆర్' టై లోగో వచ్చేసింది. రామ్చరణ్, ఎన్టీఆర్ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి RRR(రౌద్రం రణం రుధిరం) అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. సోషల్మీడియా వేదికగా శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం టైటిల్ లోగోతోపాటు మోషన్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది.
అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్, కొమరంభీంగా ఎన్టీఆర్ కనిపించబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్చరణ్కు సరసన బాలీవుడ్ నటి ఆలియాభట్, ఎన్టీఆర్కు కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో మెరుస్తారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.