వివాదాస్పద ట్వీట్..వివరణతో వీగిపోదు..నాగబాబూ అంటున్న నెటిజనం!

Update: 2020-05-21 08:25 GMT

సినీనటుడు నాగబాబు వివాదాస్పద ట్వీట్‌తో వార్తల్లోకెక్కారు. మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేను పొగుడుతూ, గాంధీజీ హత్య గురించి చర్చించాలంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ వివాదాస్పదమవుతోంది. నాగబాబు ఎందుకు ఇలాంటి పోస్టు చేయాల్సి వచ్చిందంటూ నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో కాస్తా వెనక్కు తగ్గుతూ వివరణ ఇచ్చారు. గాంధీ అంటే చాలా గౌరవమని గాడ్సే చేసిన నేరాన్ని సమర్ధించలేదంటూ రీ ట్వీట్ చేశారు మెగా బ్రదర్.

మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడు అంటూ చేసిన ట్వీట్ పై నాగబాబు నాగబాబు స్పందించారు. గాడ్సే నిజమైన దేశ భక్తుడంటూ నాగబాబు చేసిన సంచలన వ్యాఖ్యలపై నెటిజన్లు రాజకీయ నాయకుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. గాంధీని చంపిన వ్యక్తి ఎలా దేశ భక్తుడు అవుతాడు అంటూ నెటిజన్లు విమర్శించారు..

నాగబాబు ట్వీట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తో పాటు విజయశాంతి స్పందించారు. కుల, మతాల వేరైనా దైవం ఒక్కటే.. ఎన్ని తరాలైనా జాతిపితా ఒక్కడే.. 130 కోట్ల మంది భారతీయులకు మహత్ముడు ఒక్కడే అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. ఈశ్వర్, అల్లా, తేరానామ్.. సబ్ కో సన్మతి దే భగవాన్.. నాకు కూడా అని ట్వీట్ చేశారు. గాడ్సే, ఇప్పుడు బ్రతికుంటే ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్ధించేవాడు మన్నించండి మహాత్మ అంటూ విజయశాంతి ట్విట్టర్ లో వెల్లడించారు.

గాంధీని హత్య చేసిన గాడ్సేను ఉద్దేశిస్తూ నాగబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నిరుద్యోగ జేఏసీ నేత మానవతారాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. నాగబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగబాబు వివరణ ఇచ్చుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు

నెటిజన్ల విమర్శలతో వెనక్కి మెగా బ్రదర్ నాగబాబు వెనక్కి తగ్గారు. దయ చేసి అందరూ నన్ను అర్ధం చేసుకోండి.. నేను నాథూరామ్ గురించి చేసిన ట్వీట్ నాథూరాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. ఆయన వెర్షన్ కూడా జనాలకు తెలియాలి అని మాత్రమే అన్నాను. నాకు మహాత్మ గాంధీ అంటే ఎంతో గౌరవం ఉంది. నిజం చెప్పాలంటే నన్ను విమర్శించే వాల్ల కన్నా నాకు ఆయనంటే ఎనలేని గౌరవం అంటూ నాగబాబు రీ ట్వీట్ చేశారు.

మొత్తమ్మీద గాడ్సే పుట్టినరోజు పేరుతో నాగబాబు చేసిన ఈ ట్వీట్‌ వివాదాస్పదమవుతూనే అసలీ పోస్టు ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది.. ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News