Ram Charan Birthday: పడిలేచిన కెరటం కొణెదల రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు రామ్ చరణ్ తేజ్.

Update: 2020-03-27 08:53 GMT
Ram Charan

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు రామ్ చరణ్ తేజ్.. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ' చిరుత 'సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. చిరంజీవి కొడుకుగా చరణ్ ఎంట్రీ, టాప్ డైరెక్టర్ పూరి డైరెక్షన్, మణిశర్మ పాటలు అనగానే సినిమా పైన భారీ అంచనాలను పెంచాయి. ఇక సెప్టెంబర్ 28, 2007 రోజున చిరుత ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.. చరణ్ నటనకి మంచి ప్రశంసలు లభించాయి. ప్రశంసలతో పాటుగా విమర్శలు కూడా అంతే స్థాయిలో వినిపించాయి. ఏదో చిరంజీవి కొడుకు కాబట్టి సినిమా ఆడింది అని అన్నవాళ్లు లేకపోలేదు..

చిరుత సినిమా మంచి హిట్ కావడంతో రెండో సినిమా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి చేతిలో పడ్డాడు రామ్ చరణ్.. మొదటి సినిమా సక్సెస్ అయితే రెండో సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ రికార్డునే కొట్టాడు.. కాలభైరవ, హర్ష పాత్రలో చరణ్ నటన, ఫైట్స్, రాజమౌళి టేకింగ్ సినిమా స్థాయిని పెంచాయి. అయినప్పటికీ ఆ కథకి ఏ హీరోని పెట్టిన సెట్ అవుతుందన్నా విమర్శలు కూడా వినిపించాయి. క్రెడిట్ మొత్తం రాజమౌళికే వెళ్ళిపోయింది. ఇక ఆ తరవాత భారీ అంచనాలు నడుమ ఆరెంజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చరణ్.. ఈ సినిమా ప్లాప్ కావడంతో విమర్శకులుకి మరింత బలం చేకూరింది. కానీ ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే చూసే వాళ్ళ సంఖ్య కొల్లలు అనే చెప్పాలి.

ఇక ఆ తరవాత వచ్చిన రచ్చ, నాయక్ సినిమాలు పర్వాలేదు అనిపించినా తుఫాన్ , గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ వంటి చిత్రాలతో రామ్ చరణ్ గ్రాఫ్ ని కిందపడేశాయి. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ధ్రువ సినిమాతో మళ్లీ హిట్ కొట్టాడు. కానీ ఆ సినిమా రీమేక్ కావడంతో హిట్ అయింది అన్న విమర్శలు వినిపించాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా చరణ్ ని ఎక్కడో కూర్చోబెట్టింది. ఫస్ట్ టైం ఓ స్టార్ హీరో కొడుకు, మెగా ఫ్యామిలీ హీరో అన్న భేదాభిప్రాయాలు లేకుండా చరణ్ ఈ సినిమాని చేశాడు. సినిమాలో చెవిటి చిట్టిబాబు పాత్ర తప్ప ఎక్కడ కూడా రామ్ చరణ్ ఎక్కడ కూడా కనిపించలేదు. దర్శకుడు సుకుమార్ టేకింగ్ కన్నా చరణ్ నటనే సినిమాని నిలబెట్టింది అన్నది ఎవరు కాదనలేని వాస్తవం.. ఇప్పటివరకు రామ్ చరణ్ ని విమర్శించుకుంటూ వచ్చిన వారంతా ముక్కున వెలేసుకున్నారు. చరణ్ తప్పు ఎవరు చేయలేరు అన్నట్టుగా ఆ పాత్రలో ఒడిగిపోయాడు చరణ్..

తండ్రిని మించి :

సినిమా ఇండస్ట్రీలో ఏ తండ్రి అయిన తాను నిర్మాతగా ఉండి, తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకుంటాడు. కానీ చరణ్ కొత్త బ్యానర్ స్థాపించి తానే నిర్మాతగా మారి తన తండ్రిని రీఎంట్రీగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఎప్పటినుంచో తన తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ గా అనుకుంటున్న సైరా నరసింహ రెడ్డి సినిమాని తెరకెక్కించడానికి ముందుకు వచ్చి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. సినిమా విజయం పక్కన పెడితే చరణ్ చేసిన సాహసమే వంద రేట్ల విజయంగా చెప్పవచ్చు.. అటు హీరోగా, ఇటు నిర్మాతగా చరణ్ చాలా సక్సెస్ అయ్యాడు.

ఉపాసనతో పెళ్లి:

అపోలో ఆసుపత్రి సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు అనిల్ మరియు శోభన దంపతుల యొక్క పెద్ద కుమార్తె అయిన ఉపాసనని రామ్ చరణ్ 2012లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..

బాబాయ్ స్ఫూర్తి :

చరణ్ లో ఎక్కువ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పోలికలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని కోట్లకి అధిపతి అయినప్పటికి సింపుల్ గానే ఉంటాడు. తనకి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అని పలుమార్లు చెప్పుకొచ్చాడు కూడా.. ఆర్ధికంగా ఎవరు ఇబ్బంది పడ్డా కానీ వెనుకముందు ఆలోచించకుండా సహాయం చేస్తుంటాడు చరణ్..

కరోనా నియంత్రణకి అండగా 70 లక్షలు..

తాజాగా కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించిన సంగతి తెలిసిందే.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి సహాయంగా తనవంతు సహాయంగా 70 లక్షలను అందజేశాడు. దీనికి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అని చెప్పుకొస్తూ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.

రామ్ చరణ్ ఇలాగే మంచి సినిమాలు చేస్తూ మరిన్ని విజయాలను అందుకోవాలని, ఆశిస్తూ.. కొణిదెల వారసుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది హెచ్ ఎం టీవీ...

Tags:    

Similar News