బాపూ సీత 'నయనతార' బీజేపీలో చేరుతున్నారా?

లేడీ సూపర్ స్టార్ గా అందరి అభిమానాన్ని సాధించిన నయనతార అడుగులు రాజకీయాల వైపు పడుతున్నాయా? ఇటీవలి పరిణామాలు అలానే కనిపిస్తున్నాయి.

Update: 2019-12-11 10:17 GMT
సనీ నటి నయనతార

సినిమాల్లో పేరు తెచ్చుకోవడం..ఆనక రాజకీయాల్లో తళుక్కు మనడం మన దేశ రాజకీయాల్లో సహజంగా జరిగేదే. కాకపోతే, కొంత మంది విషయంలో వారు రాజకీయాల్లోకి వస్తున్నారా అంటే అంత త్వరగా నమ్మబుద్ధి కాదు. ఆ కోవలోకే వస్తారు నయనతార. తమిళ, తెలుగు సినిమా రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతని సాధించుకున్న నటీమణి నయనతార. ఆమె సాధారణంగా సినిమాల్లో తప్ప బయట ప్రజల్లో కనిపించరు. సినిమా అనేది ఆమెకి ఓ ప్రొఫెషన్ మాత్రమే. కనీసం తన సినిమాల ప్రమోషన్ కు కూడా ఆమె వెళ్లరు. అటువంటి నయనతార గురించిన ఒక విషయం ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అది ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త. 

ఎందుకీ వార్త వినిపిస్తోంది?

నయనతార ఈ మధ్యకాలంలోనే తన ప్రియుడు, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి కన్యాకుమారిలోని తిరుచెందూర్ ఆలయానికి దర్శనానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బీజేపీ మాజీ ఎంపీ నరసింహన్‌ను నయన్ కలిశారట. అందరూ సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో మాటల మధ్యలో మీరు బీజేపీలో చేరితే బాగుంటుందని నరసింహన్ అన్నారట. అంతే ఈ విషయం ఆ నోటా ఈ నోటా నయన్ అభిమానులకు చేరుకుంది. ఇంకేముంది.. నాయన తార రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారహో అంటూ నెట్టింట్లో ప్రచారం మొదలైంది. బీజేపీ లోకి చేరిపోతున్నారు అంటూ మరో వార్తా గుప్పు మంది.

ఈ నేపథ‌్యంలోనే మీడియాతో మాట్లాడిన నరసింహన్  ఈ విషయం పై స్పందించారు. తాను నయనతారని అనుకోకుండా ఆలయంలో కలిసానన్నారు. ఈ సందర్భంగా నయన్, నేను గత వారంలో హైదరాబాద్ లో జరిగిన ఎన్ కౌంటర్ సంఘటన గురించి మాట్లాడుకున్నామన్నారు. ఆడపిల్లలను కాపాడటానికి ప్రత్యేక చట్టాలు తేవాలన్ననయన్ మాటల మధ్యలో తన అభిప్రాయాన్ని చెప్పారన్నారు. నయన్ అలా అనడంతో మోదీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కల్పిస్తారని, ఆయన ప్రభుత్వంలో చట్టాలు, నిబంధనలు కఠినంగా ఉంటాయని చెప్పానన్నారు. ఈ సందర్భంగా ఆమెను బీజేపీలో మీ లాంటి వారు పార్టీలో చేరితే బాగుంటుందని అన్నానని ఆయన స్ఫష్టం చేసారు.

సాధారణంగా హీరోలకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో సౌత్‌లో నయనతారకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నారు. ఆమె రాజకీయ ప్రవేశం చేస్తే చాలా మందికి ఆదర్శవంతమైన నాయకురాలిగా నిలుస్తారన్నారు. ఈ మాటలన్నీ విన్న నయన్ ఏమీ మాట్లాడకుండా చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారని ఆయన తెలిపారు.

ఇక నయన్ విషయానికొస్తే, ఈ విషయం పై ఆమె నేరుగా ఇప్పటివరకూ స్పందించలేదు. ఆమె తనంత తానుగా స్పందించే అవకాశమూ లేదు. ఎందుకంటే, నయనతార ఇప్పటి వరకూ కనీసం ఫేస్ బుక్ ఎకౌంట్ కూడా లేదు. అసలు ఆమె వరకూ ఈ విషయం చేరిందో లేదో కూడా సందేహమే! మరి అటువంటప్పుడు ఆమె స్పందించే పరిస్థితి లేదు. ఎక్కడన్నా ఎవరన్నా పాత్రికేయులు ఆమెను కలిసినపుడు ఈ విషయాన్ని అడిగితె అప్పుడు దీనిపై ఆమె క్లారిటీ ఇవ్వవచ్చు. ఏది ఏమైనా సినిమాల విషయంలోనే మీడియా ముందుకు  రావడానికి ఇష్టపడని వ్యక్తి.. ఒక్కసారిగా రాజకీయాల్లోకి వస్తుందని అనుకోవడం భ్రమే అని చెప్పొచ్చు. కానీ, ఈ విషయం పై ఆమె క్లారిటీ వచ్చే వరకూ ఈ రకమైన వార్తలూ ఆగవు. 

ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాదు, 2020లో విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా అర్ధమవుతుంది. మరి ఈ సమయంలో నయన్ రాజకీయాల్లోకి వస్తారనుకోవడం పొరపాటనే చెప్పుకోవాలి. 




Tags:    

Similar News