కుక్క కోసం పెద్దపల్లిజిల్లాలో కొట్లాట..

Update: 2019-04-22 11:40 GMT

వారిది ఆస్తుల పంచాయతీ కాదు, డబ్బుల కోసం పడిన గొడవ అంతకంటే కాదు, వేరే కారణాలు అస్సలు లేవు. కానీ విచక్షణా రహితంగా దాడి చేసుకున్నారు. ఒక కాంగ్రెస్ నేత కుక్క కోసం ఇద్దరు మహిళలను చావ చితక్కొట్టారు. చివరకు కుక్క పంచాయితీ కాస్త పోలీస్ స్టేషన్ కు చేరడంతో కేసు నమోదయ్యింది.

పెద్దపల్లి జిల్లా గాంధీనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి కట్కూరి సందీప్‌ నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఓ పెంపుడు కుక్క ఉంది. పక్కింటి పరిసరాలు అపరిశుభ్రం చేస్తోంది. తమ ఇంటి ముందు పరిసరాలను కుక్క అపరిశభ్రం చేస్తోందని ఎన్నిసార్లు చెప్పినా సందీప్ కుటుంబం పట్టించుకోలేదు. దీంతో వారు సందీప్‌ను నిలదీశారు. దీంతో తమనే నిలదీస్తారా అంటూ సందీప్ పక్కింటి మహిళలను విచక్షణారహితంగా కొట్టాడు. ఇరుగు పొరుగు వారు సర్దిచెబుతున్నప్పటికీ సందీప్‌ ఆగలేదు. ఎవరు అడ్డు పడుతున్నా మహిళలపై తన ప్రతాపాన్ని చూపించాడు .అక్కడ ఉన్న వారు సందీప్ మహిళలపై చేస్తున్న దాడిని తమ సెల్ ఫోన్ లలో బంధించారు. ఎవరు అడ్డుకున్నా ఆగకుండా, వారు క్రింద పడిపోయినా వదలకుండా సందీప్ పిడిగుద్దులు గుద్దాడు. స్థానికంగా ఈ గొడవ వివాదస్పదంగా మారింది. గాయపడిన మహిళలు పోలీసులకు పిర్యాదు చేయడంతో సందీప్‌ను అరెస్టు చేశారు.

Similar News