ఊపిరితిత్తుల వ్యాధితో ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయనను చూడగానే నవ్వుతో కూడిన ముఖం, నుదిటిపై బ్యాండ్ కనిపిస్తాయి ఆయనకు సెంటిమెంట్లు ఎక్కువ. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వీటికి సంబంధించి వివరణ ఇచ్చారు. దాసరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొన్నాళ్లు పని చేసిన కోడి రామకృష్ణ తన తొలి చిత్రంగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చేశారు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. దీంతో రెండో చిత్రానికి పెద్దగా గ్యాప్ తీసుకోలేదు.
కోవలం బీచ్ దగ్గర తన రెండో సినిమా చిత్ర షూటింగ్ జరుపుతున్నారు కోడి రామకృష్ణ. ఆ సమయంలో అక్కడికి ఎన్టీ రామారావు కాస్ట్యూమర్ మోకా రామారావు వచ్చారట. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో సినిమా చేస్తున్న కోడిని చూసిన ఆయన మీ నుదురు ఎండకి కాలిపోతుంది అని తన జేబులో ఉన్న రుమాలు ఇచ్చారట.ఆ రోజంతా ఆ రుమాలుని అలానే ఉంచుకున్న కోడి రామకృష్ణ తర్వాతి రోజున బ్యాండ్‌లా తయారు చేసి కట్టుకున్నారట. ఇది మీకు బాగా సూట్ అయింది. దీనిని కట్టుకోకుండా ఉండొద్దు అని మోకా రామారావు చెప్పారట. ఇక అప్పటి నుండి ఆయనకి ఈ తల బ్యాండ్ సెంటిమెంట్‌గాను మారింది. దీంతో ఆయనకి ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. పోలీసులకు టోపి, రైతుకు తలపాగా ఎలాగో నాకు ఈ బ్యాండ్ అలా అన్నమాట. దీన్ని చాలా పవిత్రంగా చూసుకుంటాను అని పలుమార్లు కోడి రామకృష్ణ ఇంటర్వ్యూలలో తెలిపారు.