ఆ ఊళ్లో ఓటే వేయరు...36 ఏళ్లుగా చెక్కు చెదరని రికార్డు

సర్పంచి ఎన్నికలకు ఆ ఊళ్లో గ్రామస్ధులు ఓట్లేయరు. ఆ గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి అక్కడ ఎన్నికలు జరగలేదు. మూడున్నర దశాబ్దాలుగా ఆ ఊరిది ఒకే మాట ఒకే బాట.

Update: 2019-01-10 03:05 GMT
Pocharam Village

సర్పంచి ఎన్నికలకు ఆ ఊళ్లో గ్రామస్ధులు ఓట్లేయరు. ఆ గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి అక్కడ ఎన్నికలు జరగలేదు. మూడున్నర దశాబ్దాలుగా ఆ ఊరిది ఒకే మాట ఒకే బాట. పల్లె చిన్నదే అయినా సమష్టి నిర్ణయాలు తీసుకుని ప్రథమ పౌరున్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఇప్పటివరకు ఆరు పర్యాయాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న వాళ్లే అక్కడ సర్పంచులు వార్డు సభ్యులు ఈ ఎన్నికల్లోనూ అదే పంథా కొనసాగిస్తామంటున్న కామారెడ్డి జిల్లాలోని ఓ పల్లెపై ప్రత్యేక కథనం.

పోచారం కామారెడ్డి జిల్లాలో ఓ కుగ్రామం ఇది ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్వగ్రామం ఇది. ఒకప్పుడు ఇబ్రహీంపేట్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే ఈ పల్లె 1984లో గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. అప్పట్నుంచి ఇప్పటివరకు ఈ ఊర్లో పంచాయతీ ఎన్నికలంటే తెలియదు. పోటీ అసలే ఉండదు. గ్రామ ప్రథమ పౌరుడిగా మాజీ మంత్రి పోచారం సూచించిన వ్యక్తినే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. మూడు దశాబ్దాలుగా ఈ గ్రామంలో స్ధానిక సంస్ధల ఎన్నికలన్నీ ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. గ్రామ పంచాయతీగా ఏర్పడిన నాటినుంచి పోటీలేని గ్రామంగా జిల్లాలోనే గుర్తింపు పొందిందని గ్రామస్ధులు చెబుతారు. ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం ఇచ్చే నజరానాతో గ్రామాన్ని అభివృద్ది చేసుకుంటామని గ్రామస్ధులు చెబుతారు. ప్రస్తుతం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంటామని అంటున్నారు.

900మంది జనాభా ఉంటే పోచారం గ్రామంలో 653మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గ్రామ పెద్దలు, గ్రామస్ధులు కూర్చుని అన్ని కులాలకు ప్రాతినిథ్యం కల్పించేలా సర్పంచ్‌, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. అంతేకాదు ఎలాంటి గొడవలకు తావులేకుండా సమష్టిగా ఊరంతా ఒకే మాటకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.

జనాభా పరంగా కుగ్రామంగా ఉన్నా అభివృద్దిలో మాత్రం మేజర్ గ్రామ పంచాయతీల సరసన నిలుస్తుంది. మాజీ మంత్రి పోచారం స్వగ్రామంగా ఉన్న పోచారం పల్లె ఏకగ్రీవాల గ్రామంగా రికార్డులు సృష్టిస్తోంది. ఆ గ్రామ స్పూర్తి మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని మనమూ ఆశిద్దాం.

Similar News