రుతుపవనాల రాక మరింత ఆలస్యం..ఈసారి కూడా...

Update: 2019-06-05 13:16 GMT

నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కావొచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మందగమనం కారణంగా జూన్ ఆరు-ఏడుకి అటుఇటుగా కేరళను తాకే అవకాశముందని మూడ్రోజుల క్రితం అంచనా వేసిన ఐఎండీ ఇప్పుడు మరింత ఆలస్యం కావొచ్చని తెలిపింది. రుతుపవనాల రాకకు వాతావరణ పరిస్థితులు ప్రతిబంధకంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది.

నైరుతి రుతుపవనాలు దోబూచులాడుతుండటంతో జూన్ ఏడు తర్వాతే కేరళను తాకే అవకాశం కనిపిస్తోంది. ఆ లెక్కన 12 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోకి 13 తర్వాత తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక గతేడాదిలాగే ఈసారి కూడా నైరుతి నిరాశపర్చొచ్చని, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది.

రుతుపవనాలు నెమ్మదిగా కదులుతుండటంతో మరికొన్ని రోజులు ఎండల తీవ్రత తప్పదని హెచ్చరిస్తున్నారు. వారం రోజులు ఆలస్యంగా మాన్ సూన్ కేరళను తాకనుండటంతో, తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించడానికి కనీసం మరో వారం రోజులు పడుతుందని, అప్పటివరకు భానుడి భగభగలు తప్పవని చెబుతున్నారు. 

Tags:    

Similar News