ప్రియాంక శర్మకు సుప్రీంలోఊరట...మమతాకు క్షమాపణలు చెప్పాలన్న ధర్మాసనం

Update: 2019-05-14 08:47 GMT

మమతా బెనర్జీ ఫోటోను మార్ఫింగ్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియాంకశర్మకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీదీకి క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఇటీవల గాలేలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ కమ్ హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్‌పై నెట్టింట్లో పెద్ద రచ్చే జరిగింది. ప్రియాంక చోప్రా గోస్ట్‌‍లా డ్రస్సేసుకుని రావడం ఆ డ్రెస్‌పై సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్లు పేలడం బాగానే జరిగాయి. అయితే ఈ మీమ్స్‌ సినీ సెలబ్రిటీస్‌లతో ఆగకుండా పొలిటికల్‌ లీడర్ల వరకు వెళ్లాయి. బెంగాల్‌ దీదీ మమతా బెనర్జీ ఫేస్‌ మార్ఫింగ్‌ చేయడంతో విషయం వివాదంగా మారింది.

ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై టీఎంసీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన పోలీసులు మార్ఫింగ్‌ చేశారనే ఆరోపణలతో బెంగాల్‌కు చెందిన బీజేవైఎం నేత ప్రియాంకశర్మను అరెస్ట్‌ చేశారు. అయితే దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రియాంకశర్మకు బెయిల్‌ మంజూరు చేసింది. తన క్లయింట్‌ ఫోటోలు మార్ఫింగ్‌ చేయలేదని తన దగ్గరకు వచ్చిన ఫోటోను ఇతరులకు ఫార్వార్డ్‌ చేశారని ప్రియాంక శర్మ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే ప్రియాంక శర్మను విడుదల చేసేందుకు అంగీకరించిన న్యాయస్థానం విడుదల తరువాత మమతాబెనర్జీకి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ ఆదేశించింది.  

Similar News