పరిషత్ ఎన్నికల్లో జనసేన పోటీ?

Update: 2019-04-20 14:51 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మూడు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌ జరగనుంది. మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. అయితే మే 6 నుంచి జరగనున్న పరిషత్‌ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ మేరకు పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి శంకర్‌గౌడ్‌, మరో నేత మహేందర్‌రెడ్డి పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ముందు తమ ప్రతిపాదన ఉంచారు. జనసేన సిద్ధాంతాలను గ్రామస్థాయి నుంచి అమలు చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తలు సూచించారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను వారు శుక్రవారం కలిశారు.

పార్టీ గుర్తులపై పరిషత్‌ ఎన్నికలు జరుగుతున్నందున పోటీ చేస్తే పార్టీకి మేలు జరిగే అవకాశం ఉందని వారు సూచించారు. కాగా ఈ ప్రతిపాదనపై జనసేనాని సానుకూలంగా స్పందించారు. అనంతరం శంకర్‌గౌడ్‌ మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ నిర్ణయం మేరకు పోటీపై త్వరలోనే స్పష్టత ఇస్తామని తెలిపారు. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లోతెలంగాణలో జనసేన, బీఎస్పీ కలిసి పోటీ చేసిన 7 నియోజకవర్గాల్లో పోలింగ్‌ సరళి, మరియు పార్టీ గుర్తు ప్రజల్లోకి ఎలా వెళ్లింది?, అసలు ప్రజల్లో పార్టీ పట్ల ఆదరణ ఎలా ఉంది? అనే విషయాలపై పవన్‌కల్యాణ్‌ ఆరా తీసినట్లు సమాచారం. 

Similar News