జ‌గ‌న్ అనే నేను..: 30న జ‌గ‌న్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు

Update: 2019-05-25 01:09 GMT

నవ్యాంధ్ర రెండో సీఎంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న జగన్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. 30న ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జగన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కనీసం 5 నుంచి 7 లక్షల మంది హాజరు అవుతారని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం 20 ఎకరాల ఖాళీ స్థలాన్ని ఎంపిక చేయాలని జగన్ వైసీపీ నేతలను ఆదేశించినట్లు సమాచారం.

ప్రమాణస్వీకారానికి పెద్దసంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను జగన్‌ ఆదేశించారు. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు జగన్‌ను కలిసి ప్రమాణస్వీకార ఏర్పాట్లపై చర్చించారు. జగన్ ప్రమాణస్వీకార వేదికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తొలుత విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయాలని జగన్ భావించారు. అయితే ట్రాఫిక్ సమస్య తీవ్రం అవుతుందని అధికారులు సూచించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ప్రస్తుతం విజయవాడలోని చినఅవుటపల్లిలో సిద్ధార్థ మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.

Similar News