ఏపీలో మండుతోన్న ఎండలు

Update: 2019-05-05 05:02 GMT

ఏపీలో ఏడాదికెడాదికి ఎండలు పెరిగిపోతున్నాయి. కొన్ని మండలాల్లో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు విపత్తుల నిర్వహణ శాఖ రూపొందించిన నివేదికను పరిశీలిస్తే కొన్ని ఆందోళనకర విషయాలు బయటపడుతున్నాయి. ఇంతకీ ఏమిటీ ఆ విషయాలు..? ఈ మండలాల్లో ఎండలు ఏ విధంగా ఉన్నాయి..? విపత్తుల నిర్వహణ శాఖ నివేదిక ఏం చెబుతోంది..?

ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. మరోవైపు 2010 నుంచి ఇప్పటి వరకు ఉష్ణోగ్రతలపై విపత్తుల నిర్వహణ శాఖ రూపొందించిన నివేదికను పరిశీలిస్తే 139 మండలాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. గత తొమ్మిదేళ్లలో కనీసం ఐదేళ్లు, అంతకంటే ఎక్కువసార్లు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన మండలాలను ఈ కేటగిరీ కింద గుర్తించారు. 466 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మొత్తం 670 మండలాల్లో కేవలం 65 చోట్లే సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నాయంటే ఎండల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా ఎండలు అంటే రాయలసీమే గుర్తుకొస్తుంది. కానీ తీవ్రమైన ఎండలు సీమలో కంటే కోస్తాలోనే నమోదవుతుండటం ఆందోళనకరమైన అంశం. కృష్ణా జిల్లాలోని 50 మండలాల్లో 27 చోట్ల, ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లో 25 చోట్ల తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గుంటూరులో 20, నెల్లూరులో 16 మండలాలు, ఉభయగోదావరి జిల్లాల్లో 12 మండలాల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఎండల జాబితాలోనూ అత్యధికంగా 52 మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. చల్లగా ఉంటుందని భావించే ఈ జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే మండలం ఒక్కటీ లేకపోవడం విశేషం. 

Similar News