ఏపీలో మరో పథకానికి వైఎస్ఆర్ పేరు...జగన్‌ కీలక నిర్ణయం

Update: 2019-06-01 01:27 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకాన్ని వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్‌గా మార్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కాగా తాజాగా మరో పథకానికి కూడా వైఎస్ఆర్ పేరు పెట్టారు. ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకంపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఆ పథకానికి వైఎస్ఆర్ అక్షయపాత్రగా నామకరణం చేశారు. మధ్యాహ్నం భోజనం అందించే ఏజన్సీలకు గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్టు ప్రకటించారు. వారికి నెలనెలా ఇచ్చే రూ.1000 గౌరవ వేతనాన్ని రూ. 3000లకు పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ఏపీ సమాచార పౌరసంబంధాల శాఖ పత్రికా ప్రకటన విడుదల చేసింది. విద్యావ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీపడొద్దని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. ఇది ప్రాథమిక సమావేశమని, ఇంకా పూర్తిస్థాయి ప్రణాళికలతో మళ్లీ సమావేశం కావాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయ రెడ్డి, పాఠశాల విద్య కమిషనర్‌ సంధ్యారాణి, అక్షయపాత్ర నిర్వాహకులు సత్యగౌడ చంద్రదాస్‌, వంశీధర దాస, నిష్కింజన దాస పాల్గొన్నారు.

Similar News