అఖిలపక్ష భేటిని బహిష్కరించిన ప్రధాన పార్టీలు ..

Update: 2019-01-30 05:26 GMT

విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తలపెట్టిన అఖిలపక్షం సమావేశానికి ప్రతిపక్షాలు హ్యాండిచ్చాయి. వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌, వామపక్షాలన్నీ రాలేమంటూ లేఖలు పంపాయి. దీంతో అసలు అఖిలపక్ష సమావేశం జరుగుతుందా..? లేదా..? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశం నుంచి విపక్షాలు తప్పుకున్నాయి. అఖిలపక్ష సమావేశానికి రాలేమంటూ తిరిగి లేఖలు పంపాయి. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలతో అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపారు. అయితే రకరకాల కారణాలతో సమావేశానికి హాజరుకాలేమంటూ పార్టీలు తేల్చిచెప్పాయి.

ఈ సమావేశంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబుకు బహిరంగ లేఖను విడుదల చేశారు. బుధవారం సమావేశానికి మంగళవారం సాయంత్రం ఆహ్వానం పంపడం ఆక్షేపనీయమన్న పవన్‌ సరైన ఎజెండా లేకుండా నిర్వహించే మొక్కుబడి భేటీలకు జనసేన దూరంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ లబ్ది కోసమే అఖిలపక్షం సమావేశం నిర్వహిస్తున్నారని లేఖలో ఆరోపించిన పవన్‌ బలమైన పోరాటంతోనే హోదా సాధించగలుగుతామని అలాంటి పోరాటానికి మాత్రమే జనసేన చేతులు కలుపుతుందని వెల్లడించారు.

ఇటు కాంగ్రెస్‌ పార్టీ కూడా సమావేశానికి రాలేమంటూ లేఖ పంపించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి హోదా ఇస్తామని అధ్యక్షుడు రాహుల్‌ ఇప్పటికే ప్రకటించారని ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్‌ లేఖలో పేర్కొన్నారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశం సమయంలో పోరాటం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. అఖిలపక్ష సమావేశానికి హాజరవడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు కాబట్టి సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో ప్రకటించారు.

ఇక వైసీపీ కూడా సమావేశానికి దూరంగా ఉండగా బీజేపీకి అసలు ఆహ్వానమే పంపలేదు. దీంతో ఇవాళ జరగనున్న అఖిలపక్ష సమావేశం ప్రజసంఘాలతో నిర్వహిస్తారా లేక వాయిదా వేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Full View  

Similar News