విజయవాడలో నాలుగేళ్ల బుడ్డోడు పోలీసులకు చుక్కలు చూపాడు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే బెంజిసర్కిల్లోకి బ్యాటరీ కారుతో వచ్చి ట్రాఫిక్ పోలీసులను పరుగులు పెట్టించాడు. పోలీసులు తనను గుర్తించారని గమనించిన ఆ నాలుగేళ్ల బాలుడు రివర్స్ గేర్ వేసి తప్పించుకోవాలని చూడడం స్థానికులను ఆశ్చర్యపరిచింది.
విజయవాడలోని పీఅండ్‌టీ కాలనీకి చెందిన నాలుగేళ్ల చిన్నారి కాలికి గాయమైంది. దీంతో ఆ చిన్నారిని తల్లిదండ్రులు పాఠశాలకు పంపించకుండా ఇంటి వద్దే ఉంచారు. ఎప్పటిలాగే బ్యాటరీ కారుతో వీధిలో ఆడుకుంటాడని భావించిన తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆ కారును నడుపుకుంటూ రద్దీగా ఉండే బెంజిసర్కిల్లోకి వచ్చాడు.
నిన్న ఉదయం 9 గంటల ప్రాంతంలో రోడ్డుపై బుడతడిని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు చిన్నారి కారును ఆపేందుకు ప్రయత్నించారు. వాహనాలు అతడిని దాటుకుంటూ వెళుతుంటే పోలీసులు పరుగులు పెట్టారు. వారిని చూసిన ఆ చిన్నారి రివర్స్ గేర్ వేసి ఇంటికి వెళ్లిపోవాలని చూశాడు. కాసేపటి తర్వాత ఎట్టకేలకు పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఇంతలో బాలుడిని వెతుక్కుంటూ వచ్చిన తల్లిదండ్రులకు అప్పగించి వారిని హెచ్చరించి పంపించారు. బుడతడి చేష్టలు చూసి ముక్కున వేలేసుకోవడం స్థానికుల వంతైంది.