అక్కడా.. మాటలూ, మాట్లాడుకోవడాలూ లేవ్!

Update: 2019-06-06 16:47 GMT

ఈ నెల 13 , 14 తేదీల్లో కిర్గిస్తాన్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఇద్దరి మధ్యా ప్రత్యేకంగా భేటీ ఉంటుందని ఇంతవరకూ అందరూ అనుకున్నారు. అయితే, ఈ సమావేశంలో వారిద్దరూ అధికారికంగా భేటీ కావడం లేదని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. 'నాకు తెలిసినంత వరకు మోదీ, ఇమ్రాన్ ఖాన్ మధ్య అధికారికంగా ఎలాంటి భేటీ ఖరారు కాలేదు.' అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. మరోవైపు బాలాకోట్, మరో చోట ఎయిర్ స్ట్రైక్‌తో అది మరింత పెరిగింది. ఈ క్రమంలో పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి సోహైల్ మహమూద్‌కు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో షాంఘై సదస్సులో ఇద్దరు ప్రధానుల మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరిగింది. మూడు రోజుల పర్యటనకు భారత్ వచ్చిన సోహైల్.. ఢిల్లీలోని జామా మసీదులో ప్రార్థనలు చేశారు. అయితే, అది ఆయన వ్యక్తిగత పర్యటన అని పాకిస్తాన్ అధికారులు చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గెలిస్తే రెండు దేశాల మధ్య చర్చలు ముందుకు సాగుతాయని గతంలో ఇమ్రాన్ ఖాన్ కూడా ఆకాంక్షించారు. ఆయన అనుకున్నట్టే జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు నేతలు ఒకే సదస్సుకు హాజరవుతున్నారు కాబట్టి, భేటీ అవుతారని ప్రచారం జరిగింది. కానీ, అలాంటిదేమీ లేదని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.

 

Tags:    

Similar News