భారత క్రికెటర్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్

Update: 2019-01-09 02:00 GMT

ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక టెస్టు సిరీస్ ను గెలుచుకున్న టీంఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బంపర్ ఆఫర్ ప్రకటించింది. మ్యాచ్‌ ఫీజ్‌కు సమానంగా బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఒక్కో మ్యాచ్‌కు ఫీజు రూ.15 లక్షల వరకు ఉంటుంది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన వారికి రూ.60 లక్షల వరకు బహుమానం దక్కనుంది. రిజర్వు ఆటగాళ్లకు మ్యాచ్‌కు రూ.7.5 లక్షలు ఇస్తారు. కోచ్‌లకు తలో రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. సహాయక సిబ్బందికి ప్రొ రేటా వేతనం లేదా ప్రొఫెషనల్‌ ఫీజుకు సమానంగా బోనస్‌ ఇవ్వనుంది.

ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే ఓడించి 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా దాదాపు 71 ఏళ్లకు దిగ్గజ క్రికెటర్లకు సాధ్యం కాని లక్ష్యాన్ని సాధించింది. ఈ ఘనతకు నజరానా ఇవ్వాలని బీసీసీఐ కమిటీ నిర్ణయించింది. ఇదిలావుంటే బీసీసీఐ నిర్ణయం పట్ల ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రతిభను మరోసారి ఈ విధంగా గుర్తించినందుకు మరింత ఉత్సాహంతో ఆడతామని వారు పేర్కొంటున్నారు. మరోవైపు ఐపీఎల్ 12వ ఎడిషన్ ఇండియాలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లుగా బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.మరిన్ని విస్తృత చర్చల అనంతరం పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని తెలిపింది. 2009లో టోర్నీ సౌతాఫ్రికాలో జరగగా, ఆ తర్వాత 2014లో సగం టోర్నీ యూఏఈలో, మిగతా సగం భారత్ జరిగింది.

Similar News