ఎవరు నిప్పు..?ఎవరు పప్పు..?

Update: 2018-04-04 06:20 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా సెంటిమెంట్ బలపడటం, 2019 ఎన్నికల్లో అది ప్రభావం చూపనుండటంతో ప్రధాన పార్టీలైన టీడీపీ-వైసీపీ మధ్య మాటల వార్ కోటలు దాటుతోంది. ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని విజయసాయి చేస్తున్న విమర్శలు.. ఒక్కోసారి హద్దులు దాటుతూ మంటలు రేపుతున్నాయి.

జగన్‌ కేసుల్లో ఏ2 నిందితుడిగా తొలుత వార్తల్లోకి వచ్చిన ఆడిటర్ విజయసాయిరెడ్డి మళ్లీ ఆ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నది ప్రస్తుతం చంద్రబాబుపై చేస్తున్న విమర్శలతోనే. ఎంపీగా ఎంపికైన తర్వాత అడపా దడపా మాత్రమే కనిపించే విజయసాయి.. ప్రత్యేకహోదా కీలకంగా మారడంతో తన నోటికి ఓ స్థాయిలో పనికల్పించి కలకలం రేపుతున్నారు. 

చంద్రబాబుపై విజయసాయి తీవ్ర విమర్శలకు పార్లమెంటే తొలి వేదికయింది. ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లకు విజయసాయి నమస్కరించారని టీడీపీ ఎంపీలు విమర్శించడంతో వివాదం మొదలయింది. ప్రత్యేకహోదాపై రాష్ట్రమంతా ప్రధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో విజయసాయి.. ప్రధాని కాళ్లకు నమస్కరించడాన్ని తప్పుబడుతూ టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగింది. దీంతో విజయసాయి గట్టిగా స్పందించాల్సిన తరుణంలో తొలిసారి చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు ప్రారంభించారు. విజయ్ మాల్యాతో తనను పోల్చడాన్ని వ్యతిరేకిస్తూ.. తాను విజయ్ మాల్యా అయితే చంద్రబాబు ప్రపంచంలోనే పెద్ద నేరగాడు చార్లెస్ శోభరాజ్ లాంటి వాడని విమర్శించారు. మరో అడుగు ముందుకేసి  ఒక తల్లికీ తండ్రికీ పుట్టినవాడైతే అంటూ చంద్రబాబుపై హద్దులు దాటిన విమర్శలు చేశారు. బాబుతోపాటు టీడీపీలోని పలువురు నేతలపై కూడా అదే స్థాయిలో విజయసాయి వ్యాఖ్యలు చేశారు.  

దీనిపై టీడీపీ నేతలు విమర్శలకు దిగి విజయసాయిని ఆర్ధిక నేరస్తుడిగా, బ్రోకర్‌గా అభివర్ణించారు. చంద్రబాబు కూడా స్వయంగా స్పందించి.. తన తల్లిదండ్రులను దూషించడం తగదన్నారు. అనంతరం మళ్లీ బాబును విమర్శిస్తూ మరో కొత్త అంశాన్ని విజయసాయి తెరమీదకు తీసుకొచ్చారు. దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యాను బాబు లండన్‌లో రహస్యంగా కలిశారని, అతని దగ్గర 150 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్‌గా తీసుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు నిరాధారమని టీడీపీ నేతలు జవాబిచ్చారు. 

తాజాగా చంద్రబాబు ఢిల్లీలో పర్యటించడాన్ని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ విమర్శలు కురిపిస్తుండగా.. విజయసాయి మరోసారి కరకు వ్యాఖ్యలకు దిగారు. లోకేష్‌ను పప్పు అని, బాబును నిప్పు అని సంభోదిస్తూ విమర్శించారు. నిప్పుగారు ఢిల్లీకి వచ్చారు.. పప్పు గారు వచ్చారో లేదో సమాచారం లేదన్నారు విజయసాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన టీడీపీ.. బీజేపీ అండతో విజయసాయికి అహంకారం పెరిగిందని, అందుకే అలా మాట్లాడుతున్నాడని కౌంటరిచ్చింది. 

హోదాపై ప్రజల్లో పెరిగిన చైతన్యం, రాష్ట్రంలో సెంటిమెంట్‌ 2019 ఎన్నికలకు గురికావడంతో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే మైలేజ్ కోసం, ప్రజల అటెన్షన్‌ను తమవైపు తిప్పుకోడానికి నేతలు హద్దు దాటడమే కలవరపెడుతోంది. హోదా వేడి ముదురుతుండటంతో విమర్శలు ఏ స్థాయికి చేరుకుంటాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Similar News