వాజ్‌పేయి గురించి నెహ్రూ చెప్పిన మాట అక్షరాలా నిజమైంది

Update: 2018-08-17 03:00 GMT

అధికారపక్షంతో అభినందనలు అందుకున్న వివాదరహితుడు. అధికారపక్షాన్ని సైతం ప్రశంసించిన రాజనీతజ్జుడు. ఇందిరను అపరకాలీగా పొగిడిన అందరివాడు. ఏయే సందర్భాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి..నెహ్రూ ఎందుకు ప్రశంసించారు...నెహ్రూ కూతురు ఇందిరను, అటల్‌ ఎందుకు పొగిడారు?

లోక్‌సభలో, యువ ఎంపీ వాజ్‌పేయి చలాకీతనం, ప్రసంగ పాఠవం, తొలి ప్రధాని నెహ్రూను అమితంగా ఆకర్షించాయి. వెనక బెంచీలో కూర్చుని సభా కార్యకలాపాలు శ్రద్దగా నోట్‌ చేసుకుంటున్నారు అటల్. ఛాన్స్ దొరికినప్పుడల్లా, లేచి హిందీలో చక్కటి ప్రసంగిస్తున్నారు.  మంచి ప్రశ్నలు వేస్తున్నారు. వాజ్‌పేయిని దగ్గర నుంచి గమనించిన నెహ్రూ, ఈ కుర్రాడికి రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంది. ప్రధాని కాగల సత్తా ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడని ప్రశంసించారు. ఐదు దశాబ్దాల క్రితమే నెహ్రూ కితాబులందుకున్న యువకెరటం అటల్‌ బిహారీ వాజ్‌పేయీ. నెహ్రూ భవిష్యవాణి ఫలించింది.

1962లో చైనా, 1965లో పాకిస్థాన్‌తో యుద్ధాలు. ఆ సమయంలో,  విపక్షంలో ఉన్న వాజ్‌పేయి, ప్రభుత్వానికి అండాదండగా నిలిచారు. ఆ నమ్మకంతోనే, 1965లో నాటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి, వాజ్‌పేయికి అనితర బాధ్యత అప్పగించారు. కాశ్మీర్‌ విషయంలో భారత్‌ వాదనను వినిపించేందుకు వాజ్‌పేయీని ఆఫ్రికా దేశాలకు దూతగా పంపించారు. విపక్ష నాయకుడైనా, అందరి మనస్సులూ గెలిచిన నాయకుడు అటల్.

ప్రత్యర్థి పార్టీలతో, అధికారపక్షంతో ప్రశంసలు అందుకోవడమే కాదు, వారినీ అభినందించడంలో, ఏమాత్రం వెనకాడలేదు వాజ్‌పేయి. పాకిస్థాన్‌ను యుద్ధంలో ఓడించి, 1971లో బంగ్లాదేశ్‌ విముక్తికి, చేయూతగా నిలిచిన, నాటి ప్రధాని ఇందిర గాంధీని కీర్తించారు. భారత విజయసారథిగా, అపర దుర్గగా ప్రశంసించారు. 1974లో ఇందిర నిర్వహించిన పోఖ్రాన్‌ అణుపరీక్షల్ని, గట్టిగా సమర్థించారు అటల్. ప్రధానిని ఓ విపక్షనేత ప్రశంసించడం, దేశ రాజకీయాల్లో ఒక అరుదైన విషయం. అందుకే అటల్‌ బిహరి  వాజ్‌పేయి, ఆజాతశత్రువు. అందరివాడు. యుగపురుషుడు.

Similar News