కేరళ: యూఏఈ 700 కోట్ల సాయం తిరస్కరణ

Update: 2018-08-23 05:27 GMT

మలయాళ సీమను ఆదుకునేందుకు యూఏఈ ప్రకటించిన 700 కోట్ల భారీ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం నిరాకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం విదేశాలు అందించే నగదు విరాళాన్ని తీసుకునే అవకాశాలు లేకపోవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వ సాయాన్ని తిరస్కరించారన్న వార్తలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కల్లోల పరిస్థితుల్లో ఉన్న కేరళ పునర్నిర్మాణం కోసం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం భారీ విరాళం ప్రకటించింది. వంద మిలియన్‌ డాలర్లు అంటే 700కోట్ల సాయం అందిస్తామని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సాయాన్ని తిరస్కరించే అకాశాలు కనిపిస్తున్నాయి. 2004లో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విపత్తు సహాయ విధానం ప్రకారం యూఏఈ సర్కారు సాయాన్ని అంగీకరించే అవకాశాలు లేవని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి.

భారత్‌ 2004 జులై తర్వాత నుంచి విపత్తుల సమయంలో ఎలాంటి విదేశీ సాయాన్ని తీసుకోవడం లేదు. 2013 నాటి ఉత్తరాఖండ్ వరదలు ఆ తర్వాత వచ్చిన కశ్మీర్ వరదల సమయంలో కేంద్రం విదేశాల నుంచి సహాయాన్ని తీసుకోలేదు. విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందనే ఉద్దేశ్యంతో 2004లో నూతన విపత్తు సహాయ విధానాన్ని మన్మోహన్‌సింగ్‌ అమల్లోకి తెచ్చారు. కేరళకు యూఏఈ ప్రకటించిన సహాయం విషయంలోనూ ఈ విధానమే వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వ అధికాలు చెబుతున్నారు.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వ సాయాన్ని తిరస్కరించారన్న వార్తలపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన సాయం కంటే యూఏఈ అంకె పెద్దది కావడం వల్లే మోడీ సర్కారు ఆ సాయాన్ని వద్దంటోందనే విమర్శలు వస్తున్నాయి. పైగా విదేశీ నగదు సాయం తీసుకుంటే ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన డబ్బు తనవద్ద లేదని కేంద్రం అంగీకరించినట్టు అవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. విదేశాలు అందించే మందులు, ఆహారపదార్థాల వంటి వస్తురూప సహాయం తీసుకునే అవకాశం ఉందికానీ నగదు తీసుకునే నిబంధన ప్రస్తుతం లేదని కేంద్ర ప్రభుత్వ చెబుతోంది. అయితే యూఏఈ అందిస్తానన్న 700 కోట్ల నగదు సాయంపై భారత విదేశాంగ శాఖకు ఇంకా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని అధికారులు చెబుతున్నారు. 
 

Similar News