అవిశ్వాసం పెడితే.. పార్టీల మద్ధతు కూడగడతా అన్న పవన్ ఎక్కడ..?

Update: 2018-07-21 06:16 GMT

ఒకరు పోరాడారు మరొకరు పోరాటంలో లేకుండా పోయారు. ప్రత్యేక హోదాయే లక్ష్యంగా సాగిన రాజకీయాల్లో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల పోరాటం ముగిసినట్లేనా..? నాలుగేళ్లు కలిసి కాపురం చేశాక ప్రత్యేక హోదా ఇవ్వట్లేదంటూ ఎన్డీయే నుంచి బయటకొచ్చిన తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు, ఏపీ పట్ల కేంద్రం వైఖరిని పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టింది. ఇటు ప్రతిపక్ష వైసీపీ మాత్రం రాజీనామాలు చేస్తామని చెప్పి చేసి చూపించింది. ఇక్కడితో కేంద్రంపై ఈ రెండు పార్టీల పోరాటం ముగిసినట్లే అని భావిస్తున్నారు. 

అయితే ప్రశ్నించేందుకే వచ్చామన్న పవన్ హోదా విషయంలో ఎక్కడి వరకు వచ్చారు..? హోదాయే అన్ని సమస్యలకు పరిష్కారం అనే లెవెల్లో మాట్లాడిన ఆయనెక్కడ..? అవిశ్వాసం పెట్టండి వంద మంది ఎంపీలను ఒక్కచోటకు తెస్తానని వాగ్ధానం చేసిన పవన్ మరిప్పుడు ఏం చేయబోతున్నారు..? హోదా కోసం ఆమరణ నిరాహర దీక్షే కాదు.. అవసరమైతే ఆత్మ బలిదానం కూడా చేస్తానంటూ ప్రకటనలు చేసిన జనసేనాని తదుపరి కార్యాచరణ ఏంటి..? 

కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా జాతీయ పార్టీల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందంటూ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఘోషించాయి. తప్పంతా కేంద్రానిదే అంటూ చేతులెత్తేశాయి. ఇలాంటి సమయంలో ఏపీ ప్రజలకు ఆశాకిరణంగా మారిన పవన్ ఏం చేయబోతున్నారు..? తప్పంతా కేంద్రంలోని జాతీయ పార్టీలదే అని పాత పాట పాడుతారా..? లేక ఈ విషయంలో తమ తప్పేం లేదని చెబుతున్న టీడీపీ, వైసీపీలకు వంత పాడతారా..? కాసేపట్లో ప్రెస్ ‌మీట్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్.. తదుపరి కార్యాచరణ ప్రకటించబోతున్నారా..? లేక ఎప్పట్లాగే విమర్శలతో ముగిస్తారా..? 

Similar News